సినీ ప్రముఖులకు సామాజిక మాధ్యమాల్లో విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు పొగుడుతూ అభిమానం ప్రదర్శిస్తే... మరికొందరు అసభ్య పదజాలం, వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సుచిత్రాకు ఓ విదేశీయుడు ఫేస్‌బుక్‌లో అసభ్యకర మెసేజ్ పంపాడు. ఆ సందేశానికి సీరియస్ అయిన సింగర్... అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఘటనకు సంబంధించిన స్ర్కీన్షాట్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని.. ముంబయి పోలీసులను ట్విట్టర్లో ట్యాగ్ చేసింది సుచిత్రా.
గాయనికి అసభ్య సందేశం పంపిన నెటిజన్ - mumbai police
బాలీవుడ్ గాయని సుచిత్రా కృష్ణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు నుంచి అసభ్యకర మెసేజ్ అందుకొని షాకైంది. అనంతరం ఆ విషయాన్ని ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నెట్టింట షేర్ చేసింది.
" అతను ఎన్‌సీపీసీ (నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్ కౌన్సిల్)లో పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. గౌరవమైన వృత్తిలో పనిచేస్తూ ఓ మహిళతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. ముంబయి పోలీస్.. ఇది కాస్త చూడండి. నాకు ఎవరో ఫేస్‌బుక్‌లో ఈ మెసేజ్‌ను పంపారు."
--సుచిత్రా, బాలీవుడ్ సినీనటి
సుచిత్రా ఫిర్యాదుపై స్పందించిన ముంబయి పోలీసులు..."మీ కేసును పరిశీలిస్తున్నాం. మీ వివరాలను మాకు పంపండి" అని ట్వీట్ చేశారు. ఆమె ప్రతిస్పందిస్తూ.. "త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. కేవలం మీ దృష్టికి తీసుకురావడానికే ఈ విషయం చెప్పాను. నాకు ఎవరి నుంచి ఎలాంటి బెదిరింపులు రావడం లేదు. నాలాంటి వారికే ఇలాంటి మెసేజ్‌లు వస్తే ఇక సోషల్ మీడియాలో ఇతర ఆడవారి పరిస్థితి ఏంటో చెప్పండి" అని పేర్కొంది.