బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టి నేటితో 28 ఏళ్లు పూర్తయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా తనను ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు కింగ్ ఖాన్. ఈ క్రమంలోనే తన తాజా ఫొటో ఒకటి పోస్ట్ చేశారు.
"నా అభిరుచి ఓ ఉద్దేశంగా మారి.. ఎప్పుడు నా వృత్తిగా మారిందో తెలియడం లేదు. ఎన్నో ఏళ్లుగా నన్ను ఆదరిస్తూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇన్నేళ్ల నా కెరీర్లో నా వృత్తి నైపుణ్యం కంటే.. నా అభిరుచితోనే మీ అందరికీ సేవ చేశానని నమ్ముతున్నా."
-షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరో
'సర్కస్ అండ్ ఫౌజీ' అనే బుల్లితెర షోతో షారుఖ్ నటనలో అరంగేట్రం చేశారు. 1992లో 'దివానా' సినిమాతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ఇందులో నటులు రిషి కపూర్, దివ్య భారతి కూడా నటించారు. ఆ తర్వాత 'డర్', 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగె', 'దిల్ తో పాగల్ హై', 'కుచ్ కుచ్ హోతా హై', 'స్వదేశ్', 'చక్ దే ఇండియా', 'కబీ ఖుషీ కబీ ఘం', 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి చిత్రాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. చివరగా 'జీరో' చిత్రంతో థియేటర్లో సందడి చేశారు.
ఈ విధంగా తన కెరీర్లో అంచెలంచెలుగా శ్రమిస్తూ.. సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్నారు షారుఖ్. ప్రస్తుతం దేశంలోనే అగ్రశ్రేణి నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఇదీ చూడండి:'నటుడిగా గెలిచినా.. వివక్ష విషయంలో ఓడిపోయా'