జూనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లో రంగప్రవేశం చేశాడు.. ప్రతినాయకుడిగా మారాడు... హీరో స్నేహితుడి పాత్రలు చేశాడు... అనంతరం కథానాయకుడిగా పేరుతెచ్చుకుని వంద చిత్రాల్లో నటించిన ఘనత సాధించాడు హీరో శ్రీకాంత్. నేడు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలపై ఓ లుక్కేద్దాం!
శ్రీకాంత్ పుట్టిపెరిగింది..
కర్ణాటక కొప్పల్ జిల్లా గంగావతిలో 1968 మార్చి 23న శ్రీకాంత్ జన్మించాడు. ధార్వాడ్‌లోని కర్ణాటక విశ్వ విద్యాలయంలో బీకామ్ పూర్తి చేసిన ఆయన, ఆ తర్వాత సినిమా రంగంపై అభిరుచితో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి డిప్లొమా పొందాడు. పలు చిత్రాల్లో ఆయనతో కలిసి నటించిన కథానాయిక 'ఊహ'ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు.. రోషన్, రోహన్ తో పాటు మేథ అనే అమ్మాయి ఉంది.
సినీ ప్రస్థానం...
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’తో నటుడిగా పరిచయమైన ఆయనకు ఆ తర్వాత అవకాశాలు వరుసకట్టాయి. తొలి చిత్రానికిగానూ రూ. 5 వేలు పారితోషికం అందుకున్నాడు. కుటుంబ కథా చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకుని 90ల్లో మహిళల అభిమానాన్ని చూరగొన్నాడు.
తొలి మలుపు
కథానాయకుడిగా తొలి సినిమా ‘వన్ బై టూ’. 1995లో విడుదలైన ‘తాజ్‌మహల్’తో ఆయన ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘పెళ్లిసందడి’, ‘ఎగిరే పావురమా’, ‘వినోదం’, ‘ప్రేయసి రావే’, ‘ఆహ్వానం’, ‘పండుగ’, ‘సింహ గర్జన’, ‘తాళి’, ‘మా నాన్నకు పెళ్లి’, ‘ఊయల’, ‘ఒట్టేసి చెబుతున్నా’ తదితర చిత్రాలు ఆయన్ను తిరుగులేని కథానాయకుడిగా మార్చేశాయి. ‘ఖడ్గం’తో మాస్ కథానాయకుడిగానూ మెప్పించాడు. వందో చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మహాత్మ’ చేశాడు. అగ్ర కథానాయకులందరితో కలిసి నటించి అందరివాడయ్యాడు శ్రీకాంత్.
మళ్లీ ప్రతినాయకుడిగా...
125 సినిమాలు పూర్తి చేసిన శ్రీకాంత్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఒకపక్క కథానాయకుడిగా నటిస్తూనే, మునుపటిలా ప్రతినాయక పాత్రలతో అలరిస్తున్నాడు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’తో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.