తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీకారం' కథ అలా పుట్టింది: చిత్ర దర్శకుడు

పుట్టి పెరిగిన ఊరు, తన చుట్టూ పరిస్థితులు నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథే 'శ్రీకారం' అని అన్నారు ఈ చిత్ర దర్శకుడు కిషోర్​.బి. ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందని చెప్పారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా తన కెరీర్​ సహా చిత్రం గురించి పలు విశేషాలను కిషోర్​ పంచుకున్నారు.

sreekaram
శ్రీకారం

By

Published : Mar 15, 2021, 7:05 AM IST

"ఒక కథను ఎంత ఆసక్తికరంగా చెప్పామన్నదే ఇప్పుడు ముఖ్యం. వాణిజ్యాంశాల కోసం ప్రత్యేకంగా సినిమాల్ని చూసే రోజులు పోయాయి. చాలా మంది మా సినిమాని చూశాక... చెప్పాలనుకున్న కథని నిజాయతీగా చెప్పారని మెచ్చుకున్నారు. ఆ మాటతోనే విజయం మా సొంతమైంది" అన్నారు కిషోర్‌.బి. ఆయన దర్శకత్వం వహించిన 'శ్రీకారం' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శర్వానంద్‌ కథానాయకుడిగా 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ నిర్మించిన చిత్రమిది. తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్న యువ దర్శకుడు కిషోర్‌ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలివీ..

"మా సినిమాని చూసేందుకు ట్రాక్టర్లలో థియేటర్లకి వెళుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. మనలో ఎక్కువమంది వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లమే కాబట్టి... ఈ కథకి అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. పరిశ్రమ నుంచీ చాలా మంది ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. దర్శకుడు హరీష్‌శంకర్‌ 'నువ్వు కథ చెప్పిన విధానం కంటే, ఇంకా బాగా సినిమా తీశావు' అన్నారు. హను రాఘవపూడి, సాగర్‌ కె.చంద్ర, కృష్ణచైతన్య... ఇలా చాలా మంది మెచ్చుకున్నారు. విజయంతోపాటు... గౌరవాన్నీ తెచ్చిపెట్టింది మా చిత్రం".

"మాది వ్యవసాయ కుటుంబమే. చిత్తూరు జిల్లా, పెరుమాళ్లపల్లి మా సొంతూరు. పుట్టి పెరిగిన ఊరు, నా చుట్టూ పరిస్థితులు, నేను కలిసిన స్నేహితుల నుంచి తెలియకుండానే స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. నిర్మాతల దృష్టిని ఆకర్షించాలంటే మొదట ఈ అంశంతో లఘు చిత్రం చేయాలనుకున్నా. అలా 2016లో నేను తీసిన లఘు చిత్రం 'శ్రీకారం' చూసి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు నిర్మాతలు. ఇది థియేటర్లకి రావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఇంత సమయం పడుతోందేమిటి అనుకున్నా. తొలి సినిమా చేయడానికి మా నిర్మాతలకి ఏడేళ్ల సమయం పట్టిందట. ఆ విషయం తెలిశాక... వాళ్లనే నేను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడిలాగే కనిపించే హీరో ఎవరున్నారా అని చూసినప్పుడు... శర్వానంద్‌ అయితేనే ఈ పాత్రకి న్యాయం చేస్తాడని నమ్మాం. ఆయన, ప్రియాంక, రావు రమేష్‌, నరేష్‌, సాయికుమార్‌, సత్య... ఇలా అందరూ పాత్రల్లో ఒదిగిపోయారు".

"ఒక రైతు తన కొడుకు ఎందుకు రైతుగా చూడాలనుకోవడం లేదనే అంశాన్ని ఇందులో బలంగా చెప్పాం. తండ్రీ కొడుకుల నేపథ్యంలో బలమైన భావోద్వేగాల్ని పండించాం. దర్శకుడిగా నా బలం అవే. ఈ సినిమా కోసం 40 ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని అందులో పంటలు పండించి చిత్రీకరణ చేశాం. చదువుకుని వ్యవసాయంలోకి వచ్చిన పలువురు యువ రైతుల్ని కలిసి వాళ్ల నుంచి ఎన్నో విషయాల్ని సేకరించి చిత్రీకరణ కోసం వెళ్లాం. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. నా అభిరుచిని గమనించి డిగ్రీ తర్వాత ఇంట్లోవాళ్లే నన్ను చిత్ర పరిశ్రమకి పంపించారు. ఒక పంపిణీదారుడి సాయంతో పరిశ్రమలో సహాయ దర్శకుడిగా ప్రయాణం ఆరంభించా. నా తదుపరి సినిమా 14 రీల్స్‌ సంస్థలోనే ఉంటుంది. యాక్షన్‌ నేపథ్యంలో, 'శ్రీకారం'కి పూర్తి భిన్నంగా ఉంటుందా చిత్రం".

ఇదీ చూడండి: సమీక్ష: శర్వానంద్ 'శ్రీకారం' టాక్ ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details