స్వరాల పుష్కరిణిలో గళ తెప్పోత్సవం.
సప్తస్వరాలకు చక్రస్నానం
పరిమళార్చనం.. స్వరవిన్యాస వినూతనం
సుమధురమే నీ సుధా గానం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
నీ ఆలాపన.
నీ లాలాపన
పండిత సంగీత ఆరాధ్యోత్సవాలకు దీప జ్వలన
అలసిన మనసులకు సరిగమల ఉద్దీపన
నవ రాగ శృతులలో, లయలలో
స్వరగతులలో..సంగతులలో..
నీవో అర్ధశతాబ్దపు పాట
రాగంపై నీది అనురాగపు సయ్యాట
విశ్రమించింది దేహమే కదా?
సందేహమా?
మరణంలోనూ ఉందిగా 'రణం'.
తుదిశ్వాసదాకా రణము.
సప్తస్వరాలపై నీ మోహానికా మరణం?
సంగీత జగమంతా బాలుమయం
పాట కచేరీలు, హృద్య భాష్య కచేరీలకు నీవు వస్తావని
చావును చావగొట్టి మృత్యుంజయుడివై వస్తావని భావించాం
అయినా దశాబ్దాలపాటు ఇక ప్రతి చోటా నీ పాటే
నీ మాటే.. నీవు చూపిన 'సరిగమకాల' బాటే
అంపశయ్య మీద నీ చివరాఖరి పోరాటం వీరోచితమే.
దేహాన్ని నిద్రపుచ్చి వస్తానని వెళ్లినవాడివి మళ్లీ రాలేదే.
ఏడేడు లోకాల్లో స్వరాల పల్లకీలో ఎక్కడ విహరిస్తున్నావో
దేవ గాంధార లోకాల్లో ఊరేగుతున్నావా
నీ పల్లకీ భుజాన మోసింది దివ్య మూర్తులేనా?
సామ వేద పండితుల 'గుండియల్ దిగ్గురనగ'
దివిజ లోకాలకు తరలిపోయావా స్వరరాజా
జగదానంద కారకుడు నీ చెవిలో ఏం చెప్పాడో ఏమో!
భలేవాడివి శ్రీరామా అంటూ వెళ్లావు.
జోల పాడి పసివాళ్లని నిద్రపుచ్చినట్లు నీ మధురస్వరాలతో
భూగోళాన్ని తన్మయ డోలికల్లో ఓలలాడించి
లాలిజో లాలిజో ఊరుకో అంటూ ఊయలలూపి
తరాల నీ స్వరాలపనను కానుకగా ఒసగి వెళ్లిపోయావా?
తిరిగి వచ్చిందాకా.. అందాకా వినండని
వేలవేల గీతాలిచ్చి.. లాలించి, ఊరడించి నిష్క్రమించావా?
వచ్చేదీ, వేళ్లేదీ చెప్పరేమో
మహాత్ములు. మార్మికులు.
'నానాటి బతుకు నాటకము'
ఇక 'ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేనా నీ ఏలిక?'
గగనానికి ఏగిన స్వరరాజా
వినీల విహాయసంలో నవస్వరాన్వేష విహారీ
'వచ్చుటా నిజమే.. పోవుటా నిజమే..
ముఖారి రాగాన్ని మా ముఖాన వేసి పోయావా?
అంతటా నీవే ఆత్మలా పొదిగావు కదా?