అనితరసాధ్యమైన అమృత గానంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులకు వేలాది పాటలు, అద్భుతమైన తన గానాన్ని జ్ఞాపకాలుగా అందించిన.. ఆ గాన గంధర్వుడి అంతిమ సంస్కారాలను చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో పూర్తిచేశారు. కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించగా తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
గతరాత్రి మహాలింగపురంలోని తన నివాసం నుంచి బాలు పార్థివ దేహాన్ని, చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు వచ్చి తమ ఆరాధ్య గాయకుడిని కడసారి చూసుకున్నారు.
దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సహా తమిళ హీరో విజయ్, బాలు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ చెన్నై వెళ్లి బాలుకు నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.