పాలాభిషేకాల పేరుతో పాలు వృథా చేయవద్దని సోనూసూద్ తన అభిమానులను కోరారు. అవసరమైన వారికి ఆ పాలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు సోనూసూద్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు ట్విటర్‌లో వైరల్‌గా మారాయి. అవి కాస్తా.. సోనూసూద్‌కు చేరాయి.
వాటిపై స్పందించిన సోనూ.. "మీ అభిమానానికి కృతజ్ఞుడను. పాలు వృథా చేయొద్దని మీ అందరినీ కోరుతున్నా. అవసరం ఉన్న వారి కోసం దాచిపెట్టండి" అంటూ సోనూసూద్ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సోనూసూద్ ఇటీవల ప్రకటించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, ఆత్మకూర్, నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయన చిత్రపటాలకు అభిమానులు క్షీరాభిషేకాలు చేశారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సోనూ ఆనందం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఆక్సిజన్ అవసరం ఉన్న రాష్ట్రాల్లోనూ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈమేరకు ఆయన కర్నూలు, ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రుల ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి సోనూసూద్ ఎంతోమందికి సాయం చేస్తూ వస్తున్నారు. సోనూసూద్ వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా లబ్ధిపొందారు. సోనూ చేసిన సాయానికి కృతజ్ఞతగా కొంతమంది ఏకంగా గుడికట్టి పూజలు చేస్తున్నారు.
ఇదీ చూడండి:స్వప్న సుందరి.. చూపుల్తో ఎదకు చేసినావే ఇంజురీ!