బాలీవుడ్లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై హీరోయిన్ సోనమ్ కపూర్.. మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై జరుగుతున్న దుర్భాషణలు చూస్తోంటే భయం వేస్తోందని తెలిపింది. మహిళా కళాకారులను గౌరవించకుండా, వారి నైతిక ప్రవర్తనను సందేహిస్తున్నారని అన్నారు. సుశాంత్ సింగ్ మృతి తర్వాత నెలకొన్న పరిస్థితులపై ఈమె పై వ్యాఖ్యలు చేసింది.
"నేను ఆ వివాదాల్లో లేను. కానీ, నా సహనటులు అందులో ఉండడం బాధ కలిగిస్తోంది. హీరోయిన్లే లక్ష్యంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క పురుషుడిపైనా ఇలాంటి ఆరోపణలు రావటం లేదు. సినిమాల్లో, ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్త్రీలను క్రియేటివ్ వ్యక్తులుగా గుర్తించడంలేదు. బదులుగా వారి నైతికతను సందేహిస్తున్నారు. మేమూ కళాకారులమే. మాకు మగ నటులకు, దర్శకులకు మధ్య ఉండే తేడా ఏంటి? వాళ్లు ఏమో హీరోలుగా కొనసాగుతున్నారు. మేము బాధితులుగా మిగిలిపోతున్నాం"