తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్​సింగరాయ్​ కోసం సరికొత్తగా ట్రై చేశా'

Nani Shyam Singha Roy movie: నాని నటించిన 'శ్యామ్​సింగరాయ్'​ కోసం 70వ దశకంలో ఉపయోగించిన తబల, సితార్​ వంటి వాయిద్యాల్నే వాడి సంగీతమందించినట్లు తెలిపారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్​. ఇంకా ఈ చిత్ర విశేషాలు సహా తన కెరీర్​ గురించి కూడా మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

నాని శ్యామ్​సింగరాయ్​,  Nani Shyam Singha Roy
నాని శ్యామ్​సింగరాయ్​

By

Published : Dec 14, 2021, 6:47 AM IST

Nani Shyam Singha Roy movie: "సంగీతం అందించే విషయంలో భాష నాకెప్పుడూ అడ్డంకి కాదు. కథను.. అందులోని పాట సందర్భాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు.. మనసులకు హత్తుకునేలా మంచి స్వరాలివ్వగలుగుతాం"న్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌. ఇప్పుడాయన స్వరాలందించిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్‌ సంకృత్యాన్‌ తెర కెక్కించారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో ముచ్చటించారు మిక్కీ జే మేయర్‌.

"మహానటి తర్వాత నేను సంగీతమందిస్తున్న రెండో పీరియాడిక్‌ చిత్రమిది. రెండు వేర్వేరు కాలాలకు సంబంధించిన ఫిక్షనల్‌ కథాంశంతో రూపొందింది. ఓ కథ 70వ దశకం నేపథ్యంలో సాగుతుండగా.. మరో కథ వర్తమానంలో నడుస్తుంటుంది. నాని ఇందులో శ్యామ్‌ సింగరాయ్‌, వాసుగా రెండు పాత్రల్లో కనిపిస్తారు. కోల్‌కతా నేపథ్యంలో సినిమా సాగుతుంటుంది కాబట్టి.. నార్త్‌, సౌత్‌ ఫ్లేవర్స్‌ మిక్స్‌ చేస్తూ ఓ సరికొత్త ఫ్లేవర్‌లో స్వరాలందించే ప్రయత్నం చేశా. అలాగే పాటల్లో బెంగాలీ సంగీతాన్ని వినిపించా. తెలుగులో ఇలాంటి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదే. సినిమాలో 70వ దశకం నాటి బెంగాల్‌ వాతావరణానికి తగ్గట్లుగానే నేపథ్య సంగీతం అందించాను. ఆ కాలంలో ఉపయోగించిన తబల, సితార్‌, సంతూర్‌ వంటి వాయిద్యాల్నే వాడి స్వరాలందించా. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చివరిగా ఈ సినిమా కోసమే రెండు పాటలు రాశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం ఫోన్‌ చేశా. 'అంతా బాగుంది. త్వరలో తిరిగి పనిలో దిగుతా' అన్నారు. నేనూ ఆయన కోలుకుంటారనే అనుకున్నా. ఈ చిత్రం కోసం ఆయన రాసిన ఇంకో గీతాన్ని త్వరలో విడుదల చేస్తాం".

"ప్రస్తుతం ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ల 'ప్రాజెక్ట్‌ కె'కు సంగీతమందిస్తున్నా. ఆ పనులు ఇంకా మొదలుకాలేదు. సంతోష్‌ శోభన్‌ హీరోగా నందిని రెడ్డి తెరకెక్కించనున్న 'అన్నీ మంచి శకునములే' చిత్రానికి, శ్రీవాస్‌ - గోపీచంద్‌ కలయికలో రూపొందనున్న కొత్త సినిమాకి స్వరాలందిస్తున్నా. అలాగే దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందుతోన్న మరో చిత్రానికీ పనిచేస్తున్నాను".

"చకచకా వంద సినిమాలు చేసేసి.. అందులో ఎనభై ప్లాప్‌ అయితే సంతృప్తి దొరకదు కదా. అందుకే నేనెప్పుడూ ఉరుకులు పరుగులుగా చేసేయాలని అనుకోను. కాస్త సమయం తీసుకున్నా.. మంచివే చేయాలనుకుంటా. అదృష్టవశాత్తూ నాకిప్పటి వరకు వచ్చినవన్నీ అలాంటి మంచి చిత్రాలే. అవన్నీ సంగీత దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిచ్చాయి. నా బలం మెలోడీ గీతాలే. అదే నన్ను చిత్రసీమలో ఇప్పటికీ కొనసాగేలా చేస్తోంది. అందుకే నేను దాన్నెప్పుడూ బలహీనత అనుకోను."

ఇదీ చూడండి:అది చేసింది నేనేనా అనిపిస్తుంది: రష్మిక

ABOUT THE AUTHOR

...view details