తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రయోగాత్మక చిత్రాలకు గురువు 'సింగీతం'

ఆయన దర్శకత్వంలో నుంచి వచ్చిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. కలం పట్టి అద్భుతమైన రచనలు చేస్తూనే, సంగీతంతో మైమరిపించగలరు. ఆయనే ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం.

singeetham
సింగీతం శ్రీనివాస రావు

By

Published : Sep 21, 2020, 6:11 AM IST

"సింగీతం శ్రీనివాసరావు అనే దర్శకుడి ఇంటి పేరు తప్పు అనుకుంటాను. అది, సంగీతం అయి వుంటుంది. దరమిలా సింగీతం అయిందేమో! ఎందుకంటే సింగీతం అనే మాటకు అర్థంలేదు కదా" అన్నాడొకాయన.

"నిజమే. సంగీతమే అయి వుంటుంది. ఆయనకి సంగీతం కూడా వచ్చు కదా దర్శకత్వంతో పాటు" అనిరెండో ఆయన అన్నాడు.

"అలాగా!"

"అవును. చిన్నతనంలో సంగీతం నేర్చుకున్నారుట. అందుకే కొన్ని కన్నడ చిత్రాలకు స్వరాలు అందించారు".

ఆయనకు రానిదీ, తెలియనిదీ లేదు. చిత్ర దర్శకుడికి తెలియాల్సిన విషయాలన్నీ సింగీతంకు తెలుసు. ఆయన చిత్రకారుడు. నాటకాలతో పాటు ఛందోబద్ధంగా పద్యాలు రచించారు. కథలు రాశారు. ఇన్ని లక్షణాలతో శ్రీనివాసరావు సినిమాల్లో ప్రవేశించారు. ఆయన అభినివేశాలన్నీ కె.వి.రెడ్డికి నచ్చి, 'మాయబజార్‌' సినిమాకు 'విద్యార్థి'గా పనిలో చేర్చుకున్నారు. తర్వాత కె.వి.దగ్గర 'పెళ్లినాటి ప్రమాణాలు', 'జగదేకవీరుని కథ', 'శ్రీకృష్ణార్జున యుద్ధం', 'సత్యహరిశ్చంద్ర' మొదలైన సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అదే సమయంలో సినిమా టెక్నిక్‌ అవగాహన, అందుకు సంబంధించిన ఆంగ్ల పుస్తకాలు, చిత్రాలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. సింగీతం మాతృభాష కన్నడ. నెల్లూరులో చదువుకోవడం వల్ల తెలుగులో ప్రావీణ్యం సిద్ధించింది. కన్నడలో కీర్తిపొందిన అనంతమూర్తి నవల 'సంస్కార'ను సినిమా చేయాలని పట్టాభిరామిరెడ్డి తలపెట్టి, సింగీతాన్ని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు. అది, ప్రయోగాత్మక చిత్రం. కేంద్రప్రభుత్వం స్వర్ణ పతకం పాందింది. కె.వి.రెడ్డి కంపెనీలో మేనేజర్‌గా చేసిన శంకర రెడ్డి - చిత్ర నిర్మాణం తలపెట్టి శ్రీనివాసరావును దర్శకుడిని చేశారు. అది, హాస్యంతో నిండిన 'నీతి నిజాయితీ' చిత్రం.

ఎన్ని ప్రయోగాలో...

ప్రయోగాలు చేయడంలో, కొత్త కథలు చెప్పడంలో శ్రీనివాసరావుకు ఆసక్తి. 'దిక్కెట్ర పార్వతి' తమిళ్​లో సి. రాజగోపాలచారి కథ తీసుకుని సహజ వాతావరణంలో చిత్రించారు. ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి. కమలహాసన్‌తో తీసిన 'అపూర్వ సహోదరులు' కొత్త ఆలోచన. కష్ట సాధ్యమైన సాంకేతికతతో తీశారు. 'పంతులమ్మ', 'జమీందారుగారి అమ్మాయి', 'రామచిలుక', 'పిల్ల జమిందారు', 'గమ్మత్తు గూఢచారులు', 'సుగుణసుందరి', 'ఆదిత్య 369', 'భైరవద్వీపం', 'బృందావనం', 'మైకేల్‌ మదన కామరాజు', 'అమవాస్య చంద్రుడు' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే 'పుష్పక విమానం' అనే మాటలు లేని చిత్రానికి ఆయన తీస్తున్నప్పుడు విమర్శలు వినిపించాయి.

"ఎప్పుడో, శబ్దంలేని రోజుల్లో మూకీ చిత్రాలు వచ్చాయి. తర్వాత శబ్దం వచ్చింది. అన్నీ పాటలు, మాటలున్న సినిమాలే. ఇప్పుడెందుకు మూకీ సినిమా? ఎవరు చూస్తారు? మాటలు పాటలూ ఉండే సినిమాలే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి." అని వచ్చిన విమర్శల్ని 'పుష్పక్‌' బాణాలతో ఎగరగొట్టేసి, ఖ్యాతి, కాసూ సంపాదించింది.

ఆయన యానిమేషన్‌ సినిమా కూడా తీశారు. 'ఘటోత్కచ్‌', హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. ఇదొక ప్రయోగం. ఆయన తీసిన సినిమాల్లో పురాణాలు, జానపదాలు, సాంఘికాలు అన్ని ఉన్నాయి. అందుకే అందరి దర్శకుల మీదా పడినట్టు శ్రీనివాసరావు మీద ఇలాంటి చిత్రాలకే శ్రీనివాసరావు అన్న ముద్ర పడలేదు. తమిళ, కన్నడ భాషల్లోనూ తీశారు. కన్నడ చిత్రాలకు సంగీతం చేశారు. ఆయనకు సంగీతం తెలియడం వల్ల అన్ని చిత్రాల్లోనూ మంచి పాటలు వినిపించాయి.

సినిమా నిర్మాణం రిస్కే

సింగీతం స్నేహశీలి. నిర్మాతలతో సద్భావంతో ఉంటూ సహకరించే గుణం వుంది. నిర్మాత బడ్జెట్‌ను బట్టి నడుచుకుంటారు. కన్నడ, తమిళ, తెలుగు భాషలు, ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడతారు. నిరంతరం తీస్తున్న సినిమా గురించే ఆలోచన. "అంతర్జాతీయ ప్రమాణాలతో మనం చిత్రాలు నిర్మించలేం. అవి ప్రపంచం అంతా ఆడతాయి. పెట్టుబడి, లాభాలు రావడానికి ఆస్కారం వుంది. మనం ఏదైనా ప్రయోగత్మకంగా చిత్రం తీయాలంటే అవి అవార్డులకే పరిమితం. థియేటర్లలో ప్రదర్శించరు. నష్టపోవాలని ఎవరూ సినిమా తీయరు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావులు భిన్నమైన చిత్రాలు తీసి, తీవ్రమైన నష్టం రావడం వల్ల ఆ కంపెనీ ఆపేశారు. పైగా, ఆ సినిమాల్లో అక్కినేని నటించారు కూడా. వ్యాపారాత్మకంగా చిత్రాలు నడవాలని సామాన్య ప్రేక్షకులకు కావలసినన్ని జొప్పిస్తారు. అవి కూడా ఒక్కోసారి ఆకట్టుకోవు. సినిమా నిర్మాణం ఎప్పుడూ రిస్కే" అని ఓ సందర్భంలో శ్రీనివాసరావు చెప్పారు.

శ్రీనివాసరావు ఛందోబద్దంగా పద్యాలు రాస్తారు. 'భైరవద్వీపం'లో 'విరిసినది వసంతగానం' పాట ఆయన రాసిందే. "కె.వి.రెడ్డి, అన్న పద్ధతి ప్రకారం ప్రణాళికలు వేసుకుని అనుకున్నట్టుగా సినిమాలు తీశారు. ప్రస్తుతం ప్రణాళికల ప్రకారం చిత్రాలు నిర్మించడం అసాధ్యం. తొందరగా సినిమా తీయాలి. విడుదల చేయాలి. లాభం వస్తే జేబులో వేసుకోవాలి. ఇదే ఆలోచన నడుస్తోంది. వారానికి నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటో రెండో నిలవడం కష్టంగా వుంది. హంగులు బాగా పెరిగాయి. టెక్నికల్‌గా సినిమా ఉన్నతమైన స్థాయిలో వుంది. సాంకేతిక ప్రాధాన్యం పెరగడం వల్ల ముఖ్య విషయమైన కథ, పాత్రలు, సన్నివేశాలు అప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి" అంటారు శ్రీనివాసరావు.

ABOUT THE AUTHOR

...view details