1917 నాటి ప్రేమకథ. బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ విరచిత విషాదాంత కాల్పనిక కథ. అలాంటి ఓ కథ కాలాల్ని జయించి... కోట్లాది హృదయాల్ని జ్వలించి... శాశ్వతత్వాన్ని సముపార్జించుకోవడం నిజంగా ఓ చరిత్రే. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చే ఎన్నో ప్రేమ కథల నడుమ కాలం మరువని కన్నీటి కథగా దేవదాసు ఇంకా ఇప్పటికీ నిలిచి ఉందంటే... అదంతా శరత్ ఇంద్రజాలమే. ఆయన సృష్టించిన పాత్రల మాయాజాలమే. ఆ పాత్రలన్నీ రక్తమాంసాలతో మన కళ్లెదురుగానే సజీవంగా కదలాడుతున్నాయనే ఊహ కలిగించడమే దేవదాస్ రచయితగా శరత్ అనుసరించిన విజయ సూత్రం. కేవలం నవలగానే కాకుండా ప్రేక్షకుల మనస్సులపై కదిలే బొమ్మల ప్రపంచం కడు నైపుణ్యంగా విసిరిన రంగుల వలగా కూడా 'దేవదాస్'ని అభివర్ణించవచ్చు. భారతీయ భాషల్లో ఇప్పటికీ పునర్నిర్మితమవుతున్న ఒకే ఒక కథ 'దేవదాస్'.
షారుక్ 'దేవదాస్'
బాలీవుడ్ బాద్షాగా తన ప్రత్యేక గుర్తింపుతో హిందీ సినిమాను శాసిస్తున్న షారుక్ ఖాన్ కూడా దేవదాసు ప్రేమలో పడిపోయాడు. మెగా బాలీవుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలసి స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ద్వారా 'దేవదాస్'ను నిర్మించి తనలోని నటుడిని సంతృప్తి పరిచాడు. అదే సమయంలో విజయాన్ని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలను అందుకున్నాడు. 2002లోనే 50 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించి బాలీవుడ్ స్టామినాని మరో స్థాయికి తీసుకెళ్లాడు షారుక్. దేశ, విదేశాల్లోనూ అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం పద్దెనిమిదేళ్ల క్రితం ఈ రోజే విడుదలైంది.
బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అనే ప్రతిష్టాత్మక సంస్థ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో షారుక్ 'దేవదాస్' నామినేట్ అయింది. అదే విభాగంలో అకాడమీ అవార్డుకూ నామినేట్ అయింది. 2010లో 'ది హండ్రెడ్ బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ వరల్డ్ సినిమా' అనే అంశంపై ఎంపైర్ సినిమా మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో ఈ చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఇటీవలి కాలంలో టైమ్స్ టాప్ టెన్, 'మూవీస్ ఆఫ్ ది మిలీనియం'లో కూడా చోటు చేసుకుంది.
అలరించిన పాటలు
'దేవదాస్' చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. సిల్ సిలా ఏ చాహత్ కా, మార్ డాలా, బైరి పియా, చలక్ చలక్, హమేషా తుమ్ కో చాహా, వో చాంద్ జైసీ లడ్ కీ, డోలారే డోలా... ఇలా అన్ని పాటలు జనరంజకంగా రూపొందాయి. ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. 'దేవదాస్' చిత్రాన్ని సంగీత ప్రధాన చిత్రంగా రూపొందించడంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ చూపిన శ్రద్ధ ప్రశంసనీయం.
కేన్స్ చిత్రోత్సవంలో