సినిమా రంగంలో రాణించాలంటే ప్రతిభతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలనేది అందరికీ తెలిసిన మాటే. ఇక్కడ అనూహ్యంగా అవకాశాలు అందిపుచ్చుకోని ఆకాశానికి ఎదిగిన వాళ్లూ కనిపిస్తారు. అనుకోని కారణాల వల్ల అవకాశాలు పోగొట్టుకుని అడ్రస్ లేకుండా పోయినవాళ్లూ దర్శనమిస్తారు. ఒక్కొక్కసారి కొన్ని విచిత్రమైన కారణాల వల్ల కూడా చక్కటి ఛాన్సులు కోల్పోయిన సందర్భాలు కనిపిస్తుంటాయి.
గడ్డం తీసినందుకు సినిమా ఛాన్స్ మిస్! - పృథ్వీరాజ్ గడ్డం స్టోరీ
నటుడు పృథ్వీరాజ్ గడ్డం తీసేసినందుకు, ఓ దర్శకుడికి కోపం వచ్చింది. సెట్ నుంచి గెటౌట్ అన్నారు. అలా గడ్డం వల్ల పృథ్వీ ఓ మంచి సినిమాను కోల్పోయారట. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది?
'పెళ్లి' చిత్రంతో నటుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్‌కు ఓసారి ఇలాంటి అనుభవమే ఎదురైందట. అక్కినేని నాగేశ్వరరావు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సీతారామయ్యగారి మనవరాలు' అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రంలో పృథ్వీ రాజ్‌ను కథానాయకుడిగా తీసుకోవాలనుకున్నారట దర్శకుడు క్రాంతి కుమార్. సినిమా ప్రారంభానికి ముందు పృథ్వీ ఆయనకు గడ్డంతో కనిపించగా.. బావుందని మెచ్చుకున్నారట. అప్పటికి తనకు ఏం షూటింగ్‌లు లేకపోవడంతో అలా గడ్డం పెంచినట్లు క్రాంతి కుమార్‌కు చెప్పారట పృథ్వీ.
మరుసటి రోజు 'సీతారామయ్యగారి మనవరాలు' షూట్‌కు వెళ్లాలని క్లీన్ షేవ్ చేసుకోని సెట్స్‌కు వెళ్లగా దర్శకుడికి పట్టారాని కోపం వచ్చిందట. నిన్ను షేవింగ్ ఎవరు చేయమన్నారు. గెట్ అవుట్ అంటూ సెట్స్ నుంచి పృథ్వీని తరిమేశారట. ఇలా తాను ఓ మంచి చిత్రాన్ని కోల్పోవలసి వచ్చిందని ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు పృథ్వీ. ఏదేమైనా గడ్డం తీసేసినందుకు ఓ చిత్రం కోల్పోవడమంటే విచిత్రమే కదా.