తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాహుబలిలో లేనిది.. సాహోలో ఉన్నది ఇదే' - ప్రభాస్​ ముఖాముఖి

'బాహుబలి' విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్​ యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్​... త్వరలో 'సాహో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెండేళ్లు కష్టపడి దాదాపు రూ. 350 కోట్ల ఖర్చుతో సినిమా తెరకెక్కించింది సుజీత్​ నాయకత్వంలోని చిత్రబృందం. ఆగస్టు 30న విడుదలవనున్న ఈ సినిమా గురించి ప్రభాస్​ చెప్పిన కొన్ని విశేషాలు.

బాహుబలిలో లేనిది సాహోలో ఉన్నది ఇదే

By

Published : Aug 27, 2019, 6:33 PM IST

Updated : Sep 28, 2019, 12:03 PM IST

ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న ప్రభాస్​

'సాహో' చిత్రంలో కొత్తదనానికి... విజువల్​ వండర్​​ 'బాహుబలి' చిత్రానికి తేడా వివరించాడు ప్రభాస్​. యాక్షన్​ థ్రిల్లర్​ సాహోలో బైక్ వేగంగా​ నడపడానికి భయపడాల్సి వచ్చిందని ప్రత్యేక ముఖాముఖిలో చెప్పాడు.

  • 'సాహో' ప్రచార చిత్రాలు చూస్తుంటే హాలీవుడ్‌ సినిమాలు గుర్తొస్తున్నాయి. ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేటప్పుడు మీరు అదే రేంజ్​లో ఉండాలని అనుకున్నారా.?

'సాహో' పక్కాగా ఓ కమర్షియల్‌ సినిమా. లార్జర్‌ దేన్‌ లైఫ్‌లా ఉంటుంది. బాహుబలి తర్వాత ఏం చేసినా కొత్తగానే ఉండాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఓ జలపాతాన్ని సృష్టించారు. దాన్ని ఆ స్థాయిలో చూపించాల్సిన పనిలేదు. కానీ ఆకాశమంత ఎత్తు చూపించేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఫైటింగులు, ఛేజింగులు ఇవన్నీ భారీ స్థాయిలో ఉండడానికి కారణమూ అదే.

  • 'బాహుబలి' తర్వాత మీ కోసం పెద్ద దర్శకులు క్యూలో నిలబడ్డారు. కానీ ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌కి అవకాశం ఇచ్చారు. కారణమేంటి?

'రన్‌ రాజా రన్‌'’తోనే సుజీత్‌ చాలా బాగా నచ్చాడు. తను స్క్రీన్‌ ప్లే బాగా చేయగలడని అర్థమైంది. అందుకే "నాకో సినిమా చేస్తావా" అని అడిగాను. "మంచి కథ రాశాక కలుస్తా" అన్నాడు. తన ఆత్మవిశ్వాసం చూసి ముచ్చటేసింది. అనుకున్నట్టే మంచి కథతో వచ్చాడు. 'సాహో'లో కొన్ని సన్నివేశాలు చాలా కీలకం. ఒక్కో సన్నివేశం మళ్లీ మళ్లీ తెరపై కనిపిస్తుంటుంది. అందులోనే రకరకాల షేడ్స్‌ కనిపిస్తాయి. వాటిని తెరకెక్కించడం చాలా కష్టం కానీ సుజీత్‌ సమర్థంగా పని పూర్తిచేశాడు.

  • ఈ సినిమాలో యాక్షన్‌ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా చేసిన కసరత్తేంటి?

'బాహుబలి'తో పోలిస్తే 'సాహో'లో యాక్షన్‌ సన్నివేశాలు పూర్తిగా విభిన్నమైనవి. కొన్ని యాక్షన్‌ ఘట్టాల్ని ఎలా తెరకెక్కించాలో అర్థం కాలేదు. అబుదాబిలో కొన్ని ఫైట్స్‌ తీశాం. వాటి కోసం జెట్స్‌, రిమోట్‌ కార్లు లాంటివి వాడాం. రిమోట్‌ కార్లని నేను చూడడం అదే మొదటిసారి. ఇలాంటి సన్నివేశాల్ని తెరకెక్కించే కెమెరాలు ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తారట. అవి కూడా మేం విదేశాల నుంచి ఓడల్లో దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి సన్నివేశానికి ముందు చాలా కసరత్తు చేశాం. కళా విభాగం, కెమెరా టీమ్‌ సమన్వయంతో పనిచేశాయి. ఈ సన్నివేశాల్ని ఎడిట్‌ చేసిన విధానం కూడా హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుంది.

  • 'సాహో'లో మీరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంపై క్లూ ఇస్తారా?

ద్విపాత్రాభినయమా కాదా అనేది థియేటర్‌కు వెళ్లాక తెలుస్తుంది. ఇప్పటికే కథ గురించి కొన్ని క్లూలు ట్రైలర్‌లో ఇచ్చేశాం.

  • రెండు భాగాలుంటాయా..?

'బాహుబ‌లి' సిరీస్​లాగే 'సాహో' రెండు భాగాలుగా రాబోతుంది. ద‌ర్శ‌కుడు సుజీత్ ఈ సినిమా స్క్రిప్టును అలాగే డిజైన్ చేశాడ‌ు. అయితే 'సాహో' విడుద‌లైన వెంట‌నే రెండో భాగం రాద‌ు. రెండు మూడేళ్ల త‌ర్వాతే పార్ట్ 2 తీయాలని అనుకుంటున్నాం.

  • కలుసుకోవాలనుందా..?

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన అభిమానులకు గోల్డెన్‌ ఆఫర్‌ ప్రకటించాడు. తనను ప్రత్యక్షంగా కలుసుకునే అరుదైన అవకాశాన్ని కల్పించబోతున్నాడు. అతడ్ని నేరుగా కలుసుకోవాలంటే 'సాహో' చిత్ర పోస్టర్‌తో ఓ సెల్ఫీ దిగి ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు ట్యాగ్‌ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇలా పంపిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారితో కాసేపు వ్యక్తిగతంగా మాట్లాడనున్నాడు ప్రభాస్.

Last Updated : Sep 28, 2019, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details