డ్వేన్ జాన్సన్... అంటే చాలా మందికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ 'ద రాక్' అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు రెజ్లింగ్ ప్రియులు. అంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్సన్. నేడు రాక్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం!
ఓ క్రీడలో జాతీయ స్థాయికి వెళ్లడమే గొప్ప. అలాంటిది మరో ఆటలో ప్రావీణ్యం సంపాదించి అందులోనూ ఛాంపియన్ అయ్యాడు రాక్. అక్కడితో ఆగకుండా నటుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకనైనా విశ్రాంతి తీసుకున్నాడా అంటే అదీ లేదు రచయితగా, నిర్మాతగానూ నిరూపించుకున్నాడు.
బ్యాక్‌గ్రౌండ్..
1972 మే 2న అమెరికాలో జన్మించాడు డ్వేన్ డగ్లస్ జాన్సన్. 19 ఏళ్లకే ఫుట్‌బాల్ క్రీడలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వంశపారంపర్యంగా వస్తున్న రెజ్లింగ్ నేర్చుకుని అందులో రాటు దేలాడు. డ్వేన్ వాళ్ల తండ్రి,తాత, బంధువుల్లో చాలామంది రెజ్లర్లే.
రెజ్లింగ్ కెరీర్..
1999లో ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో అడుగు పెట్టిన డ్వేన్... రింగ్‌లో తన పేరును రాక్‌గా మార్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ద్వారే సుపరిచితుడయ్యాడు. ఎనిమిది సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో రాయల్రంబల్ విజేతగానూ నిలిచాడు. 2004 వరకు ప్రొఫెషనల్ రెజ్లర్‌గా ఉన్న డ్వేన్ తర్వాత విరామం తీసుకున్నాడు. మళ్లీ 2011లో పునరాగమనం చేశాడు.
సినీప్రస్థానం...
2001లో వచ్చిన మమ్మి రిటర్న్స్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు రాక్. అనంతరం స్కార్పియన్ కింగ్, ‘ద రన్‌డౌన్’, ‘ద అదర్‌గైస్’, ‘మొవానా’, ‘జుమాంజీ: వెల్‌కమ్ టు ద జంగిల్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాలతో సినీ అభిమానులను మెప్పించాడు. ప్రస్తుతం అతడు నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో తొమ్మిదో చిత్రమైన హ్యాబ్స్ అండ్ షా ఆగస్టు 2న విడుదల కానుంది. ఇవే కాక జుమాంజీ 3, జంగిల్ క్రూస్ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.
అంతర్జాతీయ పోటీల్లో పది సార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ‘ద రాక్ సేస్’ అనే పుస్తకం కూడా రాశాడు డ్వేన్. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోయిన వాటిలో ఒకటిగా నిలిచింది. అంతేగాక 2019 ఏడాదికి గాను టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన.. ‘ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపుతున్న తొలి వందమంది’ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు రాక్.