బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ముంబయి ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. వీరిద్దరికీ బెయిల్ మంజూరుపై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో రియా ఈరోజు కూడా బైకుల్లా జైలులోనే ఉండనుంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో రియా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో ఆమెను సీబీఐ విచారించగా.. డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. రియాను మూడు రోజుల పాటు విచారించిన అధికారులు మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరచగా.. ఈనెల 23వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తాజాగా, ఆమె ముంబయి సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ కేసులో అరెస్టయిన నిందితులందరి బెయిల్‌పైనా శుక్రవారం నిర్ణయం వెలువరించనుంది.