బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అకస్మాత్తుగా మరణించడంపై అతడి కుటుంబసభ్యులు.. పలువురు ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసుపై దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రియా చక్రవర్తి.
బాలీవుడ్‌లో కథానాయికగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న రియా.. ఇప్పుడు సుశాంత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. సినిమాల కోసం నిర్మాణ సంస్థల వద్దకు వెళ్లాల్సిన ఆమె.. పోలీస్‌స్టేషన్, దర్యాప్తు సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో కేంద్ర బిందువుగా మారిన రియా చక్రవర్తి అసలు ఎవరు? సుశాంత్‌తో సంబంధమేంటి? ఆమెపైనే ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? అనే ప్రశ్నలకు వివరాలను తెలుసుకుందాం.
రియా చక్రవర్తి 1992 జులై 1న బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఇంద్రజిత్ది స్వస్థలం పశ్చిమ బెంగాల్ కాగా.. తల్లిది కర్ణాటకలోని మంగళూరు. తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడం వల్ల హరియాణాలోని అంబాల ఆర్మీ పాఠశాలలో రియా విద్యాభ్యాసం జరిగింది.
సినీరంగంలో తెరంగేట్రం
2009లో రియా ఓ టీవీ ఛానెల్‌లో వీడియో జాకీ(వీజే)గా చేరింది. 2012లో తెలుగులో వచ్చిన 'తూనీగ..తూనీగ' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో మరుసటి ఏడాది 'మేరే డాడీకి మారుతీ' చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 'సోనాలీ కేబుల్', 'దోబారా: సీ యువర్ ఎవిల్', 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్', 'బ్యాంక్ చోర్', 'జలేబీ' చిత్రాల్లో నటించి యువ కథానాయికగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల రియా తన సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి వివిడ్రేజ్ రియాలిటిక్స్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్థాపించింది.
సుశాంత్‌సింగ్‌తో పరిచయం
రియా నటించిన 'మేరీ డాడీకి మారుతీ' చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. 2013లో ఈ చిత్రం విడుదలైంది. అదే ఏడాది ఓ జిమ్‌లో రియా.. సుశాంత్‌సింగ్ తొలిసారి కలిశారట. ఆ తర్వాత తరచూ మాట్లాడుకునేవారట. అయితే 2019 ఏప్రిల్‌లో వీరిద్దరు సన్నిహిత స్నేహితులుగా మారారు. పలుమార్లు ఇద్దరు కలిసి కనిపించారు.. విహారయాత్రలకు వెళ్లారు. దీంతో వీరి మధ్య ప్రేమబంధం ఉందని అందరూ భావించారు. కానీ, వారిద్దరు ఎప్పుడూ ఆ విషయం బయటపెట్టలేదు.
అయితే సుశాంత్‌తో కలిసి యూరప్ ట్రిప్‌కి వెళ్లామని ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా వెల్లడించింది. పారిస్, స్విట్జర్లాండ్, ఇటలీకి వెళ్లామని.. అయితే అక్కడ సుశాంత్ ఒకసారి హుషారుగా.. మరోసారి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. ఇటలీలో బస చేసిన హోటల్ గది నుంచి బయటకు రాలేదని తెలిపింది. ఏడాదిపాటు సుశాంత్‌తో కలిసి ఉన్న రియా.. అతడు మృతి చెందడానికి ఆరు రోజుల ముందు అంటే జూన్ 8న అతడి ఇంటిని వదిలి వెళ్లిపోయింది.
సుశాంత్‌సింగ్ మృతి
సుశాంత్‌సింగ్ జూన్ 14న ముంబయిలో బాంద్రాలోని తన ఇంట్లో మృతి చెందాడు. పోలీసులు అతడిది ఆత్మహత్య అని తేల్చిచెప్పారు. అయితే అతడి కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు బిహార్‌లో ఉంటున్న కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. ముంబయి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దాదాపు 56 మందిని విచారించారు. సుశాంత్ మృతి చెందిన తర్వాత రియా తాను సుశాంత్ ప్రేయసినని ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి రియాపై ఆరోపణలు
జులై చివరి వారంలో సుశాంత్ కుటుంబసభ్యులు రియాపై పట్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేలా ఆమె ప్రేరేపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రియాపై కేసు నమోదైంది.
సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 15 కోట్లు బదిలీ చేసుకున్నారని అతడి తండ్రి కేకే సింగ్ ఆరోపించడం వల్ల ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టింది. ఆగస్టు 9,10 తేదీల్లో రియాను ఈడీ రెండుసార్లు ప్రశ్నించింది.
మరోవైపు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. సుశాంత్ సన్నిహితులు, ఇంట్లో పనివారిని విచారించింది. ఈ క్రమంలో సుశాంత్‌కు రియా మాదకద్రవ్యాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడం వల్ల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుల్లో ప్రధానంగా రియా చక్రవర్తినే విచారిస్తున్నారు.
రియా ఏమంటోంది?
మాదకద్రవ్యాల విషయంపై స్పందించిన నటి రియా.. "నేనెప్పుడూ మాదకద్రవ్యాలు తీసుకోలేదు. సుశాంత్‌కు మాత్రం మారిజువానా తీసుకునే అలవాటుంది. దాని వాడకం తగ్గించాలని నేను ప్రయత్నించాను" అని వెల్లడించింది. సీబీఐ విచారణపై తనకు పూర్తిగా నమ్మకముందని రియా చక్రవర్తి తెలిపింది. నిజం కచ్చితంగా బయటపడుతుందని చెప్పింది. సుశాంత్ కుటుంబం చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఆపి.. దర్యాప్తు సంస్థలకే ఆ విషయాలు వదిలేస్తే మంచిదని వ్యాఖ్యానించింది.