"సగటు మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలు, సంఘర్షణలతో ముడిపడి ఉండే కథల్ని నేనెక్కువ ఇష్టపడతా" అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన భావోద్వేగభరితమైన కుటుంబ కథలకు పెట్టింది పేరు. ఇప్పుడు తొలిసారి 'నారప్ప'తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌ను టచ్ చేశారు. తమిళ చిత్రం 'అసురన్'కు రీమేక్‌గా(Asuran Remake) వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు తెలిపారు శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala).
'అసురన్'ను 'నారప్ప'గా మలిచే క్రమంలో కథలో ఎలాంటి మార్పులు చేశారు? ఛాలెంజింగ్‌గా అనిపించిన అంశాలేంటి?
కొన్ని మంచి సినిమాల్ని ఎక్కువ కెలక్కూడదు. వాటిని అలా ఉంచడమే ఉత్తమం. మన నేటివిటికి తగ్గట్లుగా, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా ఎలాంటి మార్పులు చేయాలో.. అవి చేస్తే సరిపోతుంది. అందుకే 'అసురన్' కథలో పెద్దగా మార్పులు చేయలేదు. అందులోని ఎమోషన్ నాకు చాలా ఇష్టం. ఆ ఎమోషన్‌ను మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎలా చూపిస్తే బాగుంటుందన్నది ఆలోచించి.. చిన్న చిన్న మార్పులు చేశా అంతే. ఈ సినిమాను ఎంతో ఇష్టంగా చేశా. అందుకే ఛాలెంజింగ్‌గా అనుకోలేదు.
ఈ సినిమా కోసం వెంకటేష్‌ను(Venkatesh) సెట్లో బాగా కష్టపెట్టారని తెలిసింది?
అలాంటిదేం లేదు (నవ్వుతూ). ఈ చిత్ర కథ.. పాత్ర అలాంటివి. మండుటెండల్లో ఇసుకలో పడుకొని లేవాలి. మురికి నీళ్లలో నడవాలి. కొండలు ఎక్కి దిగాలి, అడవుల్లో తిరగాలి. అది కూడా రాత్రి పూట. ఇలాంటి పాత్ర పోషించడం ఏ నటుడికైనా సవాలే. వెంకటేష్ ఈ కథను బాగా ఇష్టపడిపోయి.. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశారు. అందుకే ఇంత కష్టమైన పాత్రను కూడా చాలా అవలీలగా చేయగలిగారు. ఆయన పడిన కష్టం తెరపై అందరికీ అర్థమవుతుంది.
'నారప్ప' ఓటీటీలోకి వెళ్తుందని తెలిశాక ఏమనిపించింది?