వ్యక్తుల జీవిత చరిత్రలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకనిర్మాతలు ఎంచుకుంటున్న ప్రస్తుత ట్రెండ్ 'బయోపిక్'. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో వీటి హవా ఎక్కువైంది. అందుకే అందరిలా కాకుండా తమ సినిమా విభిన్నంగా ఉండాలని భావించిన "83" సినిమా చిత్రబృందం.. వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.
రీల్‌పై రియల్...
1983 ప్రపంచకప్ విజయం దేశంలో క్రికెట్‌కు కొత్త ఊపిరులూదింది. ఫైనల్లో అప్పటి భయంకర వెస్టిండీస్‌ను ఓడించిన "కపిల్ డెవిల్స్".. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో కప్పును అందుకుని భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. ఆ మధుర జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు బాలీవుడ్‌లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో "83" పేరుతో సినిమాను రూపొందించింది. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల నిరవధిక వాయిదా పడింది. అయితే ఆ సినిమాలో కొంతమంది క్రికెటర్ల పాత్రల్లో.. నిజజీవితంలో ఆ ఆటగాళ్ల కొడుకులు నటించడం విశేషం. భారత్ జట్టు మాజీ ఆటగాళ్ల తనయులే కాకుండా.. విండీస్ దిగ్గజ క్రికెటర్ల కొడుకులు సైతం ఈ సినిమాలో కనిపించబోతుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది.
మరాఠి సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన చిరాగ్ పాటిల్ గురించి ఎక్కువ మందికి తెలీకపోవచ్చు. కానీ అతను 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యుడైన సందీప్ పాటిల్ కొడుకు. ఈ సినిమాలో అతను తన తండ్రి పాత్రను పోషించాడు.