తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అది చేసింది నేనేనా అనిపిస్తుంది: రష్మిక

హీరోయిన్ రష్మిక.. 'పుష్ప' సినిమా విశేషాలు పంచుకుంది. అల్లు అర్జున్​తో నటించాలనే కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ కానుంది.

rashmika pushpa movie
హీరోయిన్ రష్మిక

By

Published : Dec 13, 2021, 5:57 PM IST

Updated : Dec 13, 2021, 6:21 PM IST

అల్లు అర్జున్ తో కలిసి నటించాలన్న తన కల 'పుష్ప' సినిమాతో నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందని హీరోయిన్ రష్మిక మురిసిపోయింది. ఈ చిత్రంలో డీ గ్రామరైజ్డ్ గా శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక.. షూటింగ్​కు వెళ్లకముందే చిత్తూరు యాస నెర్చుకొని సెట్​లో అడుగుపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 17న 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను వెల్లడించింది.

హీరోయిన్ రష్మిక

అల్లు అర్జున్‌తో నటించాలనే మీ కల నిజమైంది. ఇప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?

రష్మిక: నేను నటించిన 'గీత గోవిందం' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ వచ్చారు. ఆ సమయంలోనే అతనితో నటించాలనుకున్నా. 'పుష్ప' ఆ అవకాశాన్ని అందించింది. అనుకున్నది జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే, ఆయనతో నటించేందుకు తొలినాళ్లలో కాస్త భయపడ్డా. ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని ఆలోచిస్తుండేదాన్ని. నా పరిస్థితిని గమనించి 'నీలో ప్రతిభ ఉండబట్టే ఇక్కడి వరకూ వచ్చావు. ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యావు' అని అర్జున్‌ చెప్పారు. అప్పటి నుంచి నాలో మార్పు కనిపించింది.

అల్లుఅర్జున్ రష్మిక

డీ గ్లామర్‌ పాత్రలో నటించడం ఎలా అనిపించింది?

రష్మిక: డీ గ్లామర్‌ విషయానికొస్తే తొలిసారి ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో మేకప్‌ లేకుండా కనిపించా. ‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర డీ గ్లామర్‌గానే కాదు ‘రా’గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్‌లో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. సుకుమార్‌ సర్‌ ‘పుష్ప’తో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఇలాంటి కథను మనం ఇప్పటి వరకూ చూడలేదు. భవిష్యత్తులోనూ చూడలేం. ఇది పుష్పరాజ్‌ (కథానాయకుడి పాత్ర) జీవిత కథ. అతని తల్లి, సోదరుడు చుట్టూ తిరుగుతుంది. మధ్యలో నేను (శ్రీవల్లి పాత్ర) దర్శనమిస్తా. ఆయన అందరికీ పుష్పరాజ్‌ ఏమోగానీ నా దగ్గర మాత్రం పుష్పే. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని ట్రైలర్‌లో చూశారుగా!

శ్రీవల్లి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

రష్మిక: సుకుమార్‌ సర్‌ శ్రీవల్లి పాత్ర కోసం ముందుగా చిత్తూరు యాస నేర్చుకోమన్నారు. పాత్ర పరిధి మేరకు నా వంతు ప్రయత్నించా. ఇందుకు ఇద్దరు వ్యక్తులు నాకు సహాయం చేశారు. వారిలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. మరొకరు నా స్నేహితురాలి పాత్ర పోషించారు. లుక్‌ విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకున్నాం. మూడో లుక్‌ టెస్ట్‌ ఓకే అయ్యాక సెట్‌లో అడుగుపెట్టా.

శ్రీవల్లిగా రష్మిక

అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే చాలామంది కష్టమంటుంటారు. మీరేమంటారు?

రష్మిక: అర్జున్‌ డ్యాన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. ‘సామి సామి’ అనే పాటలోనే ఇద్దరం కలిసి డ్యాన్స్‌ చేశాం. అది చేసింది నేనేనా అని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. అంత అద్భుతంగా వచ్చిందా గీతం. ఈ పాట క్రెడిట్‌ అంతా దర్శకుడు సుకుమార్‌, రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, కొరియోగ్రాఫర్‌ శేఖర్‌లకే దక్కుతుంది. సెకండ్‌ పార్ట్‌లో మా ఇద్దరి మధ్య ఎక్కువ పాటలుంటాయేమో చూడాలి.

ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలున్నాయా?

రష్మిక: ఇందులో యాక్షన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎమోషన్‌ అదే స్థాయిలో ఉంటుంది. అయినా రష్మిక ఏడవకపోతే ఏం బాగుంటుంది? (నవ్వులు). ప్రేక్షకుల్ని ఏడిపించకుండా ఉండటం ఎలా చెప్పండి!

సమంత ప్రత్యేక గీతంపై మీ స్పందన?

రష్మిక: పాట చిత్రీకరణ పూర్తవగానే 'చాలా అద్భుతంగా చేశావు' అని సమంతకు ఫోన్‌లో సందేశం పంపా. సూపర్​స్టార్‌గా రాణిస్తూ ప్రత్యేక గీతంలో నటించడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అవకాశం నాకొస్తే.. చేయాలనుంటుంది. కానీ, చేస్తానో లేదో కచ్చితంగా చెప్పలేను.

సమంత

బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.. ఆ చిత్ర పరిశ్రమ గురించి ఏమైనా చెప్తారా?

రష్మిక: సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’ అనే చిత్రంలో, అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌ బై’ అనే సినిమాలో నటిస్తున్నా. ఆయా చిత్ర బృందాలు బాలీవుడ్‌లోకి నన్ను సాదరంగా ఆహ్వానించాయి. నా నటన బాగుందని ఆ చిత్ర దర్శకులు చెప్పడం నాలో ధైర్యాన్ని నింపింది. హిందీ ప్రేక్షకులూ ‘పుష్ప’కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీరు శ్రమను నమ్ముతారా? అదృష్టాన్ని నమ్ముతారా?

రష్మిక: శ్రమనే నమ్ముతా. ఒకరి అదృష్టం వల్ల ఏ సినిమా హిట్‌ అవ్వదు. ఒక్కరి శ్రమ వల్లే అది సాధ్యంకాదు. సమష్టి కృషి వల్లే ఏ చిత్రమైనా విజయం సాధిస్తుందని నమ్ముతుంటాను.

ఇవీ చదవండి:

Last Updated : Dec 13, 2021, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details