"కెమెరా ముందు రాసే ప్రతి పరీక్షని నేనెంతో ఆస్వాదిస్తుంటా. అందులో దొరికినంత గొప్ప ఆనందం మరెక్కడా దొరకదు" అంటోంది నటి రష్మిక. దక్షిణాదిలో అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్న ఈ నాయిక ఇటీవలే బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తన మూడేళ్ల సినీ ప్రయాణంలో సెట్‌తో తనకున్న అనుబంధాన్ని, నటిగా స్ఫూర్తినిచ్చే అంశాలను పంచుకుంది.
"సెట్ నాకెప్పుడూ ఆనందాన్నిచ్చే ఓ పరీక్షా కేంద్రంలాగే కనిపిస్తుంది. మనకిచ్చిన డైలాగ్స్ సాధన చేయడం.. దాన్ని గుర్తుపెట్టుకుని భావోద్వేగాలతో పలికించడం అంతా ఓ పరీక్ష రాసినట్లుగానే అనిపిస్తుంది. ఇది కాస్త శ్రమతో నిండినదే అయినా.. నాకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇక నటన బాగుందని సెట్లో చిత్రబృందం క్లాప్స్ కొట్టినప్పుడు కలిగే సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఈ మూడేళ్ల సినీ ప్రయాణంలో అలాంటి సంతోషపు క్షణాలెన్నింటినో సెట్లో అనుభవించా. నేను జీవితంలో మరెన్నో గొప్ప శిఖరాలకు చేరుకోవాలి. దక్షిణాదితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌లో కూడా చేయాలి. ఈ ఆలోచనే నాలో స్ఫూర్తి నింపుతుంటుంది"