ఇటీవలే 'థప్పడ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది ప్రముఖ నటి తాప్సీ. ప్రస్తుతం క్రీడా కథాంశంతో తెరకెక్కుతోన్న 'రష్మి రాకెట్' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో తాప్సీకి భర్తగా ప్రియాన్షు పెన్యూలీ నటించనున్నాడు. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడీ హీరో. గతంలో భవేష్ జోషీ సూపర్‌హీరో అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
తాజాగా ఓ మీడియా సమావేశంలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు ప్రియాన్షు. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో నటించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉందన్నాడు.
" నేను ఆర్మీ నేపథ్యం నుంచే వచ్చాను కాబట్టి.. అదే యూనిఫామ్‌లో పాత్రనే పోషించడం ఎంతో గౌరవంతో కూడినది. సంతోషకరమైనది కూడా. నా చివరి చిత్రం నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో వచ్చిన 'అప్‌స్టార్ట్స్'. ప్రస్తుతం ఈ చిత్రంతో మళ్లీ వెండితెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ప్రియాన్షు పెన్యూలీ, సినీ నటుడు
గుజరాత్‌కు చెందిన రష్మి అనే ఫాస్ట్ రన్నర్.. కాల్పనిక పాత్ర నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది ఆగస్టులో ఈ సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దిల్లీ, కచ్, దేహ్రాదూన్, ముస్సోరీలలో సినిమా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.