సామాజిక మాధ్యమాల్లో యాంకర్ రష్మీ గౌతమ్ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ చేతులు, కాళ్లు కట్టి ఎవర్నీ బలవంతంగా టీవీ ముందు కూర్చోబెట్టడం లేదని తెలిపింది. కరోనా వైరస్‌ను ప్రస్తావిస్తూ మంగళవారం రష్మీ ఓ ట్వీట్ చేసింది. దీన్ని చూసిన ఓ నెటిజన్ అది ముఖ్యం కాదన్నట్లు కామెంట్ చేశాడు. రష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోను, ఆమె వస్త్రధారణను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో రష్మీ అసహనం వ్యక్తం చేసింది.
"కరోనా, టీవీ షో.. పరస్పర సమస్యలని భావించే వారు ముందు వారి ఆలోచనల్ని మార్చుకోండి. అయినా ఇదంతా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. మేం మీ చేతులు, కాళ్లు కట్టేసి టీవీ ముందు కూర్చో పెట్టలేదు. మేం మీకు నచ్చనట్లు డ్యాన్స్ చేసినప్పుడు కళ్లు మూసుకోవచ్చు. లేదంటే ఛానెల్ మార్చుకోవచ్చు. ఒక్క షో హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఆడియన్స్. మమ్మల్ని స్వీకరించిన వారికి మేం కృతజ్ఞతా భావంతో ఉంటాం. షోతో సమస్యలున్న వారు చూడకుండా ఉండొచ్చు. లేకపోతే మీరొక సినిమా తీస్తుంటే అందులో నన్ను సతీ సావిత్రి పాత్రకు తీసుకోండి. నేను ఎంచుకున్న పని గురించి నన్ను ప్రశ్నించొద్దు. నాకు వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన దాన్ని ఎంచుకుని మీ అందరిలాగే పనిచేస్తున్నా"