లాక్‌డౌన్ వేళ ఉపాధి లేక ఇబ్బందిపడుతున్న వారికి ఆహారమందిస్తూ మంచి మనసు చాటుకుంటోంది హీరోయిన్ రాశీఖన్నా. అలానే తను చేస్తున్న, చేయబోయే ప్రాజెక్టుల గురించి వెల్లడించింది.అందం.. అభినయాలతో అలరించడమే కాదు.. మంచి మనసున్న నాయికగానూ అందరి మన్ననలు అందుకుంటోంది రాశీ ఖన్నా. కరోనా - లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారమందిస్తూ.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’ ఆమెను పలకరించగా.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ లాక్‌డౌన్‌లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందిస్తున్నట్లున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని చూస్తే ఏమనిపిస్తుంది?
కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితాల్ని చిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా కూలీ పనులు, చిన్న చిన్న ఉద్యోగాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారి జీవితాలు దుర్భరంగా మారాయి. క్షేత్ర స్థాయిలో వారి పరిస్థితులు చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. అందుకే నేను నా వంతుగా ఏదైనా చేయాలనిపించి #be the miracle ద్వారా ఆహారమందించే ప్రయత్నం చేస్తున్నా. రోటీ బ్యాంక్‌తో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపి ఆకలితో ఉన్న వారి కడుపులు నింపుతున్నా. కరోనా ఉద్ధృతి భయపెడుతున్నా నేను నా బృందంతో కలిసి చాలా ప్రాంతాలు తిరిగి సహాయం అందిస్తున్నా. వృద్ధాప్య గృహాలకు వెళ్లి వారికి అవసరమైన నిత్యావసరాలు అందిస్తున్నాం. ఈ విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సర్ మాకెంతో సహకారమందిస్తున్నారు. అయితే బయట సాయం కోరుతున్న చేతులు చాలా ఉన్నాయి. అవసరం చాలా పెద్దది. ఈ సమయంలో ఒక్కరిగా ఏం చేయలేం. అందరూ చేయి చేయి కలిపితే.. ఈ కష్ట సమయాలను సులభంగా అధిగమించగలుగుతాం. ఇది ప్రతిఒక్కరూ గ్రహించాలి.
కరోనా ఉద్ధృతిలోనూ ‘థ్యాంక్ యూ’ చిత్రం కోసం ఇటలీకి వెళ్లారు. భయం అనిపించలేదా?
ఈ పరిస్థితులు ప్రపంచం మొత్తం ఉన్నాయి. భయపడుతూ ఎన్నాళ్లని కూర్చుంటాం చెప్పండి. పరిస్థితులు ఎలా ఉన్నా.. ధైర్యంగా పోరాడాల్సిందే. ప్రస్తుతం యూరప్‌లో కరోనా ఉద్ధృతి అంతగా లేదు. అందుకే లోపల కాస్త భయమున్నా.. ధైర్యంగా మా షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చాం. ప్రతిరోజూ సెట్లోని అందరికీ కొవిడ్ టెస్ట్‌లు చేసేవారు. సెట్లో కరోనా కిట్లు ధరించడం తప్పని సరి చేశారు. సాధ్యమైనంత వరకు 30మంది లోపు సిబ్బందితోనే పనిచేసే వాళ్లం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా.. వాహనాల్లోనూ సామాజిక దూరం పాటిస్తూ వెళ్లే వాళ్లం. ఇలా మే 7 వరకు ఎంతో జాగ్రత్తగా చిత్రీకరణలో పాల్గొన్నాం.
‘పక్కా కమర్షియల్’ చిత్రంలో మీరు సీరియల్ నటిగా కనిపిస్తారని తెలిసింది. నిజమేనా?
అవును.. నిజమే. 'ప్రతిరోజూ పండగే' సినిమాలో టిక్‌టాక్ స్టార్‌గా ఏంజెల్ ఆర్నా అనే పాత్రలో కనిపించా. ఆ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. అది అందరికీ నచ్చింది. అందుకే మారుతి నాకు అప్పుడే మాటిచ్చారు.. ‘తర్వాతి సినిమాలో పెద్ద పాత్ర ఇస్తాన’ని. అన్నట్లుగానే ‘పక్కా కమర్షియల్’లో నా పాత్రని మరింత వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్లు ఎక్కువ వినోదాలు నిండిన పాత్రగా ఉంటుంది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమా 40శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’.