అందం, అభినయం కలగలిసిన నటి రాశీ ఖన్నా(Rashi Khanna). కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత సన్నజాజిలా మారి, గ్లామర్ డోస్ పెంచింది. 'మద్రాస్ కేఫ్'(Madras Cafe) అనే హిందీ చిత్రంతో నటిగా మారిన రాశీ 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా ఆమె నటించిన తొలి తెలుగు సినిమా 'ఊహలు గుసగుసలాడే' విడుదలై నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం..
2014..
అక్కినేని కుటుంబం నటించిన 'మనం' చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది రాశీ. అయితే ఇందులో ప్రేమ అనే చిన్న పాత్రకే పరితమైంది. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కథానాయకులుగా తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో నాయికగా కెరీర్ ప్రారంభించింది. శ్రీ సాయి శిరీషా ప్రభావతి.. ఇంత పెద్ద పేరేంటో అంటూ ఆమె పలికిన హావభావాలు ఎప్పటికీ మరిచిపోలేం. అదే ఏడాది సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'జోరు' చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఓ పాటనీ ఆలపించి, గాయనిగా మంచి మార్కులే కొట్టేసింది.
2015..
2015లో ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అవే.. గోపీచంద్ హీరోగా వచ్చిన 'జిల్', రామ్ 'శివమ్', రవితేజ 'బెంగాల్ టైగర్'. వీటిల్లో 'జిల్'లో పోషించిన సావిత్రి పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
2016..
2016లో సాయి తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'సుప్రీమ్' చిత్రంలో బెల్లం శ్రీదేవిగా కనిపించి విశేషంగా ఆకట్టుకుంది. 'హైపర్' సినిమాలో భానుమతిగా రామ్ సరసన మరోసారి కనువిందు చేసింది.
2017..
ఎన్టీఆర్ సరసన 'జై లవకుశ'లో ప్రియ, గోపీచంద్ సరసన 'ఆక్సిజన్'లో శ్రుతి పాత్రల్లో కనిపించింది.