శనివారం మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వారితో పాటు పలువురు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం కూడా ఆయనకు ప్రత్యేకంగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో చెర్రీ చేత కేక్ కట్ చేయించి.. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ.. ఈ వేడుకల్లో చరణ్‌ను ఆశ్చర్యపోయేలా చేశారు. క్రేన్ సహాయంతో బర్త్‌డే బోర్డు ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి వెండితెర యువ అల్లూరిని ఆనందంలో ముంచెత్తారు.
శుక్రవారం 'ఆర్ఆర్ఆర్'లోని సీతారామరాజు రూపంలో ఉన్న చెర్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
రామ్‌చరణ్‌కు హీరో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తామిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. "ఈ ఏడాది మాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ తమ్ముడు" అని ట్వీట్ చేశారు.