తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవ్వుల రాజు.. నటనలో రారాజు.. రాజేంద్ర ప్రసాద్

హీరోలు కూడా నవ్వించగలరని చూపించి.. కథానాయకుడి పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్.. ఆయన కెరీర్​లో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు. నేడు రాజేంద్ర ప్రసాద్​ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన​ సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం మీకోసం.

RAJENDRA PRASAD BIRTH DAY SPECIAL STORY
రాజేంద్ర ప్రసాద్​

By

Published : Jul 19, 2020, 5:25 AM IST

హాస్యానికి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు రాజేంద్రప్రసాద్‌. కమెడియన్లు, క్యారెక్టర్‌ నటులు మాత్రమే హాస్యం పండిస్తున్న రోజుల్లో.. హీరో కూడా నవ్వించగలడని, రెండు గంటలపాటు నవ్వులతోనే సినిమాను నడిపించొచ్చని నిరూపిస్తూ తన నటనా ప్రయాణం కొనసాగించారు. ప్రేక్షక ప్రియుల్లో ఆయన ఎంతగా ప్రభావం చూపారంటే.. స్వయంగా ఒకప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు 'తాను పనితో ఒత్తిడికి గురైనప్పుడు రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూసి ఉపశమనం పొందుతుంటా' అని చెప్పేవారు. నేడు రాజేంద్రప్రసాద్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్​తో పాటు, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం రండి.

సామాన్యుడి దగ్గర్నుంచి, ప్రధానమంత్రి వరకు అందరినీ తనదైన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన ఘనత రాజేంద్రప్రసాద్‌ది. హాస్యకిరీటిగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న రాజేంద్రప్రసాద్‌ 1956 జులై 19న జన్మించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ ఇంటి ఆవరణలోనే పెరిగారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆయన సలహాతో చెన్నైలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. నటుడిగా ఒక ప్రత్యేకమైన శైలి ఉంటేనే రాణిస్తావన్న ఎన్టీఆర్‌ సూచనతో, హాస్యంవైపు దృష్టిపెట్టారు రాజేంద్రప్రసాద్‌.

బాపు సినిమాతో హీరోగా పరిచయం

బాపు దర్శకత్వంలో వచ్చిన 'స్నేహం' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఆయన ఆ తరువాత 'ఛాయ', 'నిజం', 'ఆడది గడప దాటితే', 'మూడు ముళ్ల బంధం', 'దారి తప్పిన మనిషి', 'ఈ చరిత్ర ఏ సిరాతో', 'మంచుపల్లకి', 'కలవారి సంసారం', 'ముందడుగు', 'పెళ్ళిచూపులు', 'రామరాజ్యంలో భీమరాజు' తదితర చిత్రాలతో దూసుకెళ్లారు.

వంశీ చిత్రంతో మరో మలుపు

వంశీ దర్శకత్వం వహించిన 'లేడీస్‌ టైలర్‌' నుంచి ఆయన ప్రయాణం మరో మలుపు తిరిగింది. 'రెండు రెళ్లు ఆరు', 'సంసారం ఒక చదరంగం', 'ప్రేమించి చూడు', 'ఏప్రిల్‌ ఒకటి విడుదల', 'చెవిలో పువ్వు', 'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు', 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం', 'ప్రేమ తపస్సు', 'పెళ్లిపుస్తకం', 'అప్పుల అప్పారావు', 'ఎర్రమందారం', 'పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి ప్రేమలేఖ', 'ఆ ఒక్కటీ అడక్కు', 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'కన్నయ్య కిట్టయ్య', 'అలీబాబా అరడజను దొంగలు', 'అక్క పెత్తనం చెల్లెలి కాపురం', 'మాయలోడు', 'మిస్టర్‌ పెళ్లాం', 'పేకాట పాపారావు', 'మేడమ్‌', 'అల్లరోడు', 'పరుగో పరుగు' ఇలా జైత్రయాత్ర కొనసాగించారు.

హాలీవుడ్​లోనూ అరంగేట్రం

'క్విక్‌గన్‌ మురుగన్‌' అనే చిత్రంతో హాలీవుడ్‌లోకీ అడుగుపెట్టారు రాజేంద్ర ప్రసాద్. ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ, క్యారెక్టర్‌ నటుడిగా సినిమాలపై తనదైన ప్రభావం చూపిస్తున్నారు. ఓ వైపు 'మీ శ్రేయోభిలాషి', 'ఆ నలుగురు', 'ఓనమాలు' వంటి చిత్రాలు చేస్తూనే, క్యారెక్టర్‌ నటుడిగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఆయన 200కిపైగా సినిమాలు చేశారు. 'ఎర్రమందారం', 'ఆ నలుగురు' చిత్రాలకిగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకొన్నారాయన.

పురస్కారాల పంట

'మేడమ్‌'లో నటనకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం అందుకొన్నారు రాజేంద్ర ప్రసాద్. 'మేడమ్‌' అనే చిత్రంలో నటిస్తూనే, నిర్మాణం కూడా చేశారు‌. 'టోపీరాజా స్వీటీ రోజా'తో సంగీత దర్శకుడిగా మారారు, అందులో పాట కూడా పాడారు. 'టామీ'లో ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా నంది అందుకొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ని అందుకొన్న ఆయన.. 2015లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా ఎన్నికై, పలు సేవా కార్యక్రమాల్లో భాగమయ్యారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

ఇదీ చూడండి:'లూసిఫర్' రీమేక్​కు దర్శకుడు మారుతున్నాడా!

ABOUT THE AUTHOR

...view details