సంగీతాభిమానులకు సుచిరపరిచుతులైన ప్రముఖ సంగీత దర్శకులు రాజన్-నాగేంద్ర ద్వయంలో ఒకరైన రాజన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజన్.. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
మైసూర్‌లో జన్మించిన 87ఏళ్ల రాజన్... తన సోదరుడు నాగేంద్రతో కలిసి సంగీత దర్శకులుగా ఎన్నో చిత్రాలకు స్వరాలు అందించారు. తెలుగు, కన్నడ సహా మొత్తం ఐదు భాషల్లో 350కుపైగా సినిమాలకు సంగీత దర్శకులుగా వీరు వ్యవహరించారు. 1952లో విడుదలైన 'సౌభాగ్య లక్ష్మి' చిత్రంతో సంగీత దర్శకులుగా కెరీర్ ఆరంభించిన రాజన్... దాదాపు 37 సంవత్సరాలపాటు సంగీత సేవలు అందించారు. అగ్గిపిడుగు, పూజ, ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, పంతులమ్మ, మూడు ముళ్లు చిత్రాలతో శ్రోతల మదిలో స్థానం సంపాదించుకున్నారు రాజన్.