'ఇక నుంచి ప్రతి పండగకు మీకో సర్ప్రైజ్ తప్పకుండా ఉంటుంది' -కరోనా తర్వాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలైన సందర్భంగా చిత్రబృందం చెప్పిన మాట ఇది. అన్నట్లుగానే చకచకా షూటింగ్ ప్రారంభించి, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ టీజర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత పెద్దగా సందడి కనిపించలేదు. న్యూఇయర్ సందర్భంగా అభిమానులు సంబరపడేలా ఏదైనా విడుదల చేస్తారని భావించినా.. 'ఈ ఏడాది మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాం' అంటూ శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను మాత్రం పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంక్రాంతి బహుమతి కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు రాజమౌళి. స్వాతంత్ర్య సంగ్రామం నాటి కథ కావడం వల్ల ఆ రోజును విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ పరిచయ టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వగా, కొమరం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ పరిచయ టీజర్‌కు చెర్రీ వాయిస్ ఇచ్చారు. ఇక త్వరలో విడుదల చేయబోయే టీజర్‌కు అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌తో వాయిస్ చెప్పించాలని చిత్ర బృందం యోచిస్తోందట. ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. సంక్రాంతి సందర్భంగా ఏదైనా ఆసక్తికర విషయం చెబుతారా? అన్ని చూడాలి.