అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితుడు, బాలీవుడ్ నటి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజ్‌కుంద్రా ఈనెల 19న అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమగోడు వెల్లబోసుకుంటున్నారు. రాజ్‌కుంద్రా తమను ఎలా వంచించాడో పోలీసులకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు. కుంద్రా కొందరిపై లైంగికదాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉండి అవకాశాలు లేనివారికి డబ్బు ఆశ చూపిన రాజ్‌కుంద్రా.. మరికొందరికి బాలీవుడ్‌లో అవకాశాలను ఎరగా వేసినట్లు తెలుస్తోంది.
లైంగిక దాడికి పాల్పడినట్లు
నటి షెర్లిన్ చోప్రా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కుంద్రాపై పలు ఆరోపణలు చేసింది. ఈ కేసులో పోలీసుల నుంచి సమన్లు అందుకున్న ఆమె.. ఈనెల 27న వాంగ్మూలం ఇచ్చింది. తనతో రాజ్‌కుంద్రా ప్రవర్తించిన తీరును పుసగుచ్చినట్లు వివరించింది. 2019 ప్రథమార్థంలో 'ది షెర్లిన్ చోప్రా యాప్' పేరుతో తన మేనేజర్‌కు ఫోన్ చేసిన రాజ్‌కుంద్రా.. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే కంటెంట్ ఉచితమని, అదే కస్టమరైజ్డ్ యాప్ ద్వారా అయితే డబ్బు వస్తుందని ఆశచూపినట్లు ఆమె పేర్కొంది. ఆ సమావేశం తర్వాత ఒకసారి తన నివాసానికి వచ్చిన అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది. అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముద్దుపెట్టినట్లు వాపోయింది. భార్య శిల్పాశెట్టితో తన సంబంధం సంక్లిష్టంగా మారినట్లు చెప్పాడని, అదే విషయాన్ని చాలాసార్లు నొక్కి చెప్పినట్లు బాధితురాలు తెలిపింది. ఒకానొక దశలో రాజ్‌కుంద్రా తీరు చూసి భయపడిపోయిన తాను.. అక్కడే ఆగిపోవాలని సూచించినట్లు చెప్పింది. చివరికి ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి దాకున్నట్లు వాపోయింది.