ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకిపైగా చిత్రాలకు 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్' చెప్పిన ఆయన.. తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి 'పెళ్లి సందD' చిత్రం తీస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో. శ్రీలీల కథానాయిక. ఈ చిత్రంలోనే దర్శకేంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. వశిష్టగా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ రాఘవేంద్రరావు పాత్ర వీడియో ఒకటి విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.
రాఘవేంద్రరావు నటుడిగా.. వీడియోలో స్టైలిష్‌గా
ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందిన స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు.. నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఏం సినిమాలో? ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు?
'సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు' అని రాజమౌళి పేర్కొన్నారు.
సూట్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని, బాస్కెట్ బాల్ పట్టుకుని స్టైలిష్‌లుక్‌లో దర్శనమిచ్చారు రాఘవేంద్రరావు. ఆయనతోపాటు రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, రోషన్ ఈ వీడియోలో కనిపించారు. వశిష్ట పేరుతో సాగే నేపథ్య సంగీతం అలరిస్తుంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.