"లీజు యజమానులు, థియేటర్ల గుత్తాధిపత్యం చేస్తున్న కొద్దిమంది వ్యక్తుల లాబీయింగ్ వల్లే థియేటర్లు తెరుచుకోవట్లేదు" అన్నారు నిర్మాత, చలనచిత్ర వాణిజ్యమండలి సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో సినిమా రంగంలో నెలకొన్న ప్రస్తుతం సమస్యలపై మాట్లాడారు.
"కొవిడ్ పేరుతో థియేటర్లు తెరవకుండా ఇలాగే ఉంచితే ముందు ముందు అన్ని రాష్ట్రాల్లో థియేటర్ల యజమానుల నుంచి ఉద్యమం వస్తుంది. అందుకే ఈ నెల 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సినిమా హాళ్లు మూసివేయడం వల్ల వేలాది మంది కార్మికులు నష్టపోయారు. చిన్న నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితికొచ్చింది. థియేటర్లు పాడైయిపోతున్నాయి. పిఠాపురంలోని ఓ థియేటర్లో ఫర్నీచర్ దొంగల పాలైంది. దీనికి బాధ్యులు ఎవరు? విమానాలు, రైళ్లు సీటింగ్ కెపాసిటీ మార్చకుండానే నడిపిస్తున్నారు. కానీ, థియేటర్లకు వచ్చే సరికి రూల్స్ ఎందుకు మారుతున్నాయి. అక్కడ లేనంత ప్రమాదం థియేటర్లలో ఏముందో చెప్పాలి. చిత్రీకరణలు లేక కష్టాలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏ ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. చిరంజీవి సీసీసీ తరపున కార్మికులకు నిత్యావసరాలు అందించారు. కానీ, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ కార్మికుల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఏ మీకు మా కార్మికులపై బాధ్యత లేదా? థియేటర్ల సాకుతో పెద్ద హీరోలు తమ చిత్రాలు ఓటీటీలో విడుదల చేయడం సరైన పద్ధతి కాదు. హీరోలందరికీ కోట్ల రూపాయలు మార్కెట్లు ఉన్నాయంటే దానికి కారణం థియేటర్లని గుర్తుంచుకోవాలి".