ప్రియాంకా చోప్రా(Priyanka chopra).. బాలీవుడ్, హాలీవుడ్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. వ్యాపారవేత్తగా, హీరోయిన్గా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే ఆమె.. ఏడాదిలో ఎక్కువశాతం తన కుటుంబానికి దూరంగానే గడుపుతుంటుంది. కానీ లాక్డౌన్(coronavirus lockdown) కారణంగా చాలా వరకు ఇంటికే పరిమితమైందీ నటి. అయితే తిరిగి పని మొదలుపెట్టే విషయంలో చాలా భయపడినట్లు ఆమె పేర్కొంది. ఈ మేరకు ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సంఘర్షణను 'వోగ్ ఇండియా' మేగజైన్(Vogue India magazine)కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"కరోనా సమయంలో దాదాపు ఆరు నెలలపాటు ఇంట్లో నా కుటుంబంతో సురక్షితంగా ఉన్నా. అనంతరం జర్మనీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చాలా భయపడ్డా. విమానంలో ఏడ్చేశా. ఆ సమయంలో నా భర్త నిక్ నాకు అండగా నిలిచాడు. తనతో పాటు.. నా కుటుంబం నాతో జర్మనీ వచ్చింది. నేను షూటింగ్లో ఉన్నప్పుడు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకొన్నాం. ఒంటరిగా ఉన్న భావన లేకుండా నేను కాస్త కుదుటపడేందుకు నిక్ సహాయం చేయాలనుకున్నాడు."