వైవిధ్య కథల్ని తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రవీణ్ సత్తారు. 'చందమామ కథలు', 'గరుడవేగ' వంటి హిట్ చిత్రాలు అందించిన ఆయన తొలిసారి 'లెవన్త్ అవర్' అనే వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్ నేడు (ఏప్రిల్ 9) ఆహా వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ప్రవీణ్.
అదే ఆసక్తికరం..
ఓసారి నిర్మాత అరవింద్ గారు ఫోన్ చేసి ఇతర రచయితల కథని తెరకెక్కించే ఆసక్తి ఉందా? అని అడిగారు. ఉంది.. అని చెప్పగానే ప్రదీప్ అనే రచయిత రాసిన స్ర్కిప్టుని నా దగ్గరకు పంపించారు. నాకు చాలా బాగా నచ్చడం వల్ల ఖచ్చితంగా చేస్తానన్నాను. అలా ఈ 'లెవన్త్ అవర్' అవకాశం వచ్చింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 8గంటల మధ్య సమయంలో నడిచే కథ ఇది. ఓ హోటల్ నేపథ్యంలో సాగుతుంది. బ్యాంకుకి రూ. పదివేల కోట్ల బాకీ తీర్చాల్సిన మహిళ ఏం చేస్తుందనేదే ఇందులో ఆసక్తికర అంశం.
పుస్తకం ఆధారంగా..
తెలుగు వెబ్ సిరీస్‌ల్లో 'లెవన్త్ అవర్'కి ఓ స్టాండర్డ్ ఉంది. అందుకే దీన్ని బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ అనొచ్చు. తారాగణం, విజువల్ పరంగా అద్భుతంగా ఉంటుంది. '8 అవర్స్' అనే బుక్ ఆధారంగా రచయిత ప్రదీప్ సిరీస్‌కి అనుగుణంగా స్ర్కిప్టు రాసుకున్నారు. నాయికా ప్రాధాన్య కథ అని ఒకర్ని ఎక్కువగా, మరొకర్ని తక్కువగా చూపించలేదు. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది.
ఆద్యంతం ఉత్కంఠ..
భర్త నుంచి విడిపోయి.. ఆరేళ్ల కుమారుడు ఉన్న అరత్రికా రెడ్డి ఓ కంపెనీ ఛైర్మన్‌గా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? తనకు ఇష్టం లేకపోయినా కంపెనీ బాధ్యతలు ఎందుకు తీసుకుంది? అనే పాయింట్‌తో మహిళల ఔన్యత్యాన్ని చాటిచెప్పాం. ఈ సిరీస్‌లోని 8 ఎపిసోడ్లు ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. తొలి నాలుగు భాగాలు ఓ విధంగా.. చివరి నాలుగు భాగాలు మరో పంథాలో సాగుతాయి.
అనుకున్న సమయాని కంటే..
కథ పూర్తయ్యాక స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని రచయిత, నిర్మాత భావించారు. ఎక్కువ మందికి తెలియాల్సిన కథ, పెద్దగా చెప్పాలనుకుని తమన్నాని కలిసి స్ర్కిప్టు వినిపించారు. తమన్నాకి అమితంగా నచ్చడం వల్ల ఆమె వెంటనే ఓకే చేశారు. తమన్నా ఎంపికైన తర్వాతే నేను దర్శకుడిగా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. ఈ సిరీస్‌ని 42 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. చిత్రబృందం సహకారంతో 33 రోజుల్లోనే పూర్తి చేశాం.
అభినయానికి ప్రాధాన్యం..
అరత్రికా రెడ్డి అనే పాత్రలో తమన్నా ఒదిగిపోయారు. అభినయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎమోషన్ సన్నివేశాల్లో ఆమె నటన హత్తుకుంటుంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా అయినా.. సిరీస్ అయినా నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. ముంబయికి చెందిన సౌరవ్, భరత్ ఈ కథకి అత్యద్భుతంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. నాగార్జున గారితో నేను తెరకెక్కిస్తోన్న చిత్రానికీ వీళ్లిద్దరే సంగీతంఅం దిస్తున్నారు. ఇందులో సెన్సార్ పరిధి దాటి ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు.