సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు ప్రకాశ్ రాజ్. ఏ భాషలో నటించినా... ఆ భాష మాట్లాడుతూ ‘మా నటుడే’ అనేంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. మాతృభాష కన్నడ అయినప్పటికీ... తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.
‘ఇద్దరు’, ‘అంతఃపురం’, ‘కాచీవరమ్’ చిత్రాలతో జాతీయ పురస్కారాలు అందుకొన్నారు.
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ హోస్ట్‌గా... ఇలా ఎన్నో రూపాల్లో ప్రకాష్‌రాజ్ ప్రతిభ ప్రదర్శించారు. ఇప్పుడు బెంగళూరు సెంట్రల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ప్రకాష్‌రాజ్ బెంగుళూరులో 26 మార్చి, 1965న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ప్రకాష్‌రాజ్ అసలు పేరు ప్రకాష్‌రాయ్. చిత్ర సీమలో ఆయనకు గురువైన ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ సలహాతో ప్రకాష్‌రాజ్‌గా పేరు మార్చుకున్నారు.
1994లో ‘డ్యూయెట్’తో తమిళంలో పరిచయమయ్యారు. తెలుగులో ఆయన చేసిన ప్రతి పాత్ర పేరు తెచ్చిపెట్టింది. ప్రకాష్‌రాజ్‌ను ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మార్చేసింది.
దర్శకుడిగా ఆయన నాలుగు చిత్రాలు చేశారు. తెలుగులో ‘ధోని’, ‘మన ఊరి రామాయణం’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
ప్రకాష్‌రాజ్, నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకొన్నారు. ఈ ఇద్దరూ 2009లో విడిపోయారు. అనంతరం ప్రకాష్‌రాజ్ ప్రముఖ నృత్య దర్శకురాలైన పోనీ వర్మను వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు వేదాంత్ అనే అబ్బాయి ఉన్నారు.