Prabhas Interview: 'సాహో'లో చిన్నచిన్న లోపాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బాగా ఆదరించారని నటుడు ప్రభాస్ అన్నారు. ఆయన లవర్‌బాయ్ రోల్లో నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం 'రాధేశ్యామ్' ట్రైలర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'రాధేశ్యామ్' టీమ్ కొంత సమయంపాటు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఆ విశేషాలు మీకోసం..
RadheShyam movie news
ఓ సినిమా ఓకే చేసేటప్పుడు మీరు పరిగణనలోకి తీసుకునేది ఏమిటి? కథా లేదా హీరో పాత్ర?
ప్రభాస్: సినిమాని అంగీకరించే సమయంలో స్క్రిప్ట్‌ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటా. ఎందుకంటే అదే మన రాతను నిర్ణయిస్తుంది. హాలీవుడ్ వాళ్లు ఇన్ని విభిన్న చిత్రాలు ఎలా తెరకెక్కిస్తున్నారు? బ్లాక్‌బస్టర్స్ ఎలా సొంతం చేసుకుంటున్నారు? అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. కొన్నిసార్లు నా పాత్రను కూడా పరిగణనలోకి తీసుకుంటాం.
సరైన స్క్రిప్ట్‌లు ఎంచుకునే క్రమంలో మీరు ఒత్తిడికిలోనయ్యారా?
ప్రభాస్: కథలను ఎంచుకునే సమయంలో నటీనటులు ఒత్తిడి లోనవుతారు. ‘బాహుబలి’కి ముందు ఒత్తిడికి గురయ్యేవాడిని. ఆ సినిమా తర్వాత కథలు ఎంచుకోవడం మరింత కష్టంగా మారింది. అప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. కానీ, ఇప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకోవాలి.
మీ దృష్టిలో ‘బాహుబలి’ అంటే ఏమిటి? ఆ చిత్రాన్ని మీరేలా చూస్తున్నారు?
ప్రభాస్: ‘బాహుబలి’ నాకెంతో ముఖ్యమైన సినిమా. ఆ సినిమా గొప్పతనాన్ని మాటల్లో వివరించలేను. నా జీవితంలో జరిగిన గొప్ప మ్యాజిక్ ఆ సినిమానే.
'బాహుబలి' తర్వాత మీరు చేసిన 'సాహో' సైతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టింది. దానిపై మీ కామెంట్?
ప్రభాస్: 'బాహుబలి' క్రియేట్ చేసిన రికార్డ్స్ తర్వాత 'సాహో' కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అందుకు నేనెంతో ఆనందిస్తున్నా. ముఖ్యంగా ఉత్తరాదిలో 'సాహో'ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ సినిమాలో చిన్న లోపాలున్నా.. దాన్ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉత్తరాదిలో 'సాహో' ఆడింది. మా సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసిన విలేకర్లందరికీ నా ధన్యవాదాలు.
పాన్ఇండియా సినిమా అనేసరికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు వివిధ అంశాలను కోరుకుంటారు కదా?
ప్రభాస్:అది నిజమే. ముందు చెప్పినట్టుగా పాన్ ఇండియా చిత్రమంటేనే ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రేక్షకులు ఎలాంటి ఎలివేషన్స్ కోరుకుంటారనే దానిపై ఎంతో ఆలోచించాం. ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా తీయాలనే ఉద్దేశంతో దర్శకుడు రాధాకృష్ణను ఎంతో ఇబ్బందిపెట్టా.
ప్రేరణ పాత్ర చేయడం ఎలా అనిపించింది?
పూజాహెగ్డే:ప్రభాస్ సరసన ప్రేరణ పాత్రలో నటించడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ప్రేరణ పాత్ర ఎలా ఉండాలనే విషయంలో దర్శకుడికి ఒక ఆలోచన ఉంది. దానికి అనుగుణంగా నేను ప్రేరణలా మారేందుకు ఎంతో వర్క్ చేశాను.
రాధాకృష్ణ: విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ఒదిగిపోవాలంటే ముఖ్యంగా భావోద్వేగాలపై పట్టు ఉన్నవారై ఉండాలి. పాత్రల గురించి నటీనటులతో మాట్లాడుతున్న సమయంలో నాకు కూడా ఆ పాత్రలపై మరింత పట్టు వచ్చింది. విక్రమాదిత్య పాత్ర అయితే ఎంతో కష్టతరమైంది. ఎందుకంటే అలాంటి పాత్రను మనం నిజ జీవితంలో చూసి ఉండము.
ఈ సినిమా తెరకెక్కించడానికి ఎంతకాలం పట్టింది?