అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జులై 23 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. అశ్లీల చిత్రాలను నిర్మించి, పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణ నేపథ్యంలో సోమవారం రాత్రి రాజ్ కుంద్రాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన మొబైల్ ఫోన్‌తో పాటు బిజినెల్ లావాదేవీలను పోలీసులు సీజ్ చేసి.. విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరో నిందుతుడైన ర్యాన్ థ్రోప్నూ సోమవారం అదుపులోకి తీసుకోగా.. అతడ్ని కూడా జులై 23 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు.
అశ్లీల చిత్రాలు.. వ్యభిచారం
అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్టు అయిన నేపథ్యంలో ఆయన గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 2012 మార్చి 29న రాజ్ కుంద్రా తన ట్విటర్ వేదికగా.. "పోర్న్ వర్సెస్ వ్యభిచారం. కెమెరా ముందు శృంగారం చేసినందుకు డబ్బులు చెల్లించడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు.? వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా?" అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అది అప్పట్లో కాస్త వివాదాస్పదమైంది.