చిత్రపరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి వచ్చి నటులుగా ఎదిగిన వారు చాలా మంది ఉండొచ్చు. కానీ, ఒకే కుటుంబం నుంచి వచ్చిన అన్నదమ్ములు హీరోలుగా నిలదొక్కుకున్నది మాత్రం అరుదు అని చెప్పుకొవచ్చు. ఉదాహరణకు నందమూరి తారకరామారావు కుమారులైన హరికృష్ణ, బాలకృష్ణ కూడా తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హీరోగా వెలుగొందారు. అలా టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్న అన్నదమ్ములెవరో తెలుసుకుందామా!
చిరంజీవి-నాగబాబు-పవన్‌కల్యాణ్
చిరంజీవి.. 1978లో విడుదలైన 'ప్రాణం ఖరీదు' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విభిన్న పాత్రలను పోషిస్తూ.. చిత్రపరిశ్రమలో అత్యధిక హిట్ గ్రాఫ్‌తో మెగాస్టార్‌గా ఎదిగారు. చిరు తర్వాత ఆయన సోదరులైన నాగబాబు, పవన్‌కల్యాణ్ కూడా అన్న బాటే పట్టారు. మొదటి తమ్ముడైన నాగేంద్ర బాబు కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా.. ఎక్కువ సినిమాల్లో మాత్రం సహాయక పాత్రల్లోనూ, నిర్మాతగానూ వ్యవహరించారు. అలాగే.. 1998లో విడుదలైన అక్కడ 'అమ్మాయి-ఇక్కడ అబ్బాయి' చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత తనదైన సినిమాలతో ప్రేక్షకుల మనసును చూరగొని పవర్‌స్టార్‌గా బిరుదు అందుకున్నారు.
కల్యాణ్‌రామ్-ఎన్టీఆర్
దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమారులు కల్యాణ్ రామ్, తారక రామారావు (ఎన్టీఆర్). నందమూరి కల్యాణ్ రామ్ 2003లో చిత్రసీమలో అడుగుపెట్టగా.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం 'స్టూడెంట్ నం.1' సినిమాతో తారక్ హీరోగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు.
అల్లు అర్జున్-అల్లు శిరీష్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారులైన అల్లు అర్జున్, అల్లు శిరీష్ తెలుగు ప్రేక్షకులకు హీరోలుగా సుపరిచితులే. ఆయన మరో కుమారుడైన అల్లు వెంకటేశ్ ప్రస్తుతం నిర్మాణబాధ్యతలు చేపడుతున్నారు. చిరంజీవి నటించిన 'డాడీ' చిత్రంలో తన డాన్స్‌తో ఆకట్టుకున్న అల్లు అర్జున్.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు రూపొందించిన 'గంగోత్రి' చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో హీరోగా పరిచయమయ్యారు. అతని సోదరుడైన అల్లు శిరీష్.. 'గౌరవం' సినిమాతో టాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టారు. శిరీష్.. ఇటీవలే 'విలాయతీ షరాబ్' అనే హిందీ మ్యూజికల్‌లో నటించి, మెప్పించారు.