నాయకుడంటే ఇలా ఉండాలి' అనిపించేలా ప్రస్తుతం ఒక రాజకీయ నేత అయినా లేడని చాలా మంది బాధపడుతుంటారు. అందుకే రాజకీయ నేపథ్యంతో వచ్చే సినిమాల్లో హీరో పాటించే విలువలను, చేసే సంస్కరణలను, తీసుకొచ్చే మార్పులను చూసి ఆనందపడుతుంటారు. నిజ జీవితంలోనూ అలాంటి నాయకులు వస్తారని ఆశిస్తుంటారు. ఆ సినిమా చూసేంతసేపు ఇలాంటి నాయకుడు తప్పకుండా రావాల్సిందేనని బలంగా కోరుకుంటారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అలాంటి నాయకుడి కోసం అన్వేషిస్తారు. అలా ప్రజల మనసులో నాటుకుపోయిన రాజకీయ చిత్రాల గురించి ప్రత్యేక కథనం.
ఒకే ఒక్కడు...
రాజకీయాలపై స్పష్టమైన అవగాహన తెచ్చిన సినిమాల్లో ముందు వరుసలో ఉండే చిత్రం ఒకే ఒక్కడు. 2001లో అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక్క రోజు ముఖ్యమంత్రి చాలా ప్రాచుర్యం పొందాడు. ఓ సాధారణ జర్నలిస్టు యాధృచ్ఛికంగా ఒక్క రోజు సీఎం అవుతాడు. గత ముఖ్యమంత్రులు ఏళ్ల తరబడి చేయలేని అభివృద్ధిని ఒక్కరోజులో చేసి చూపుతాడు హీరో. రాజకీయ నేపథ్యమున్నా.. కమర్షియల్ పంథాలో చూపించిన తీరు జనాన్ని బాగా ఆకర్షించింది. ఒక్క రోజు సీఎం.. కథాంశమే కొత్తగా ఉన్నందున ప్రేక్షకుల నీరాజనాన్ని అందుకుంది. ముఖ్యమంత్రంటే ఇలా ఉండాలి అని సామాన్యుడిని ఆలోచింపజేసేలా ఆకట్టుకుంది.
లీడర్..
రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయినపుడు ఎలాంటి రాజకీయానుభవంలేని ఆయన కుమారుడు సీఎం అయితే ఎలా ఉంటుందో చూపించారు లీడర్ చిత్రంలో. ప్రస్తుత రాజకీయాలకు దగ్గరగా ఉంటుందీ సినిమా. నాయకుల విలువలు, విశ్వాసాలు ఏపాటివో కళ్లకు కట్టారు.
"ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత" అంటూ సాగే డైలాగ్‌తో నిజమైన నాయకత్వపు లక్షణాన్ని గుర్తు చేశారు. "ఇంత బియ్యం, ఇంత కరెంట్, కొన్ని ప్రాజెక్టుల కాదు ప్రజలకు కావాల్సింది, మార్పు కావాలి.. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు రావాలి" అంటూ యువతనూ మెప్పించిందీ చిత్రం. రానా హీరోగా 2010లో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టింది. సినిమాలోని కథానాయకుడి మాదిరి ప్రతి రాజకీయ నాయకుడు నిజమైన లీడర్ కావాలని గుర్తుచేసింది.
ప్రతినిధి..
సమాజంలో మార్పు కోసం ఓ ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ప్రతినిధి. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. "ఈ ప్రజలు గవర్నమెంటు స్కూళ్లలో చదవరు, గవర్నమెంటు ఆసుపత్రిలలో వైద్యం చేయించుకోరు, గవర్నమెంటు రవాణాను వాడరు.. కానీ ప్రతి ఒక్కరికీ గవర్నమెంటు ఉద్యోగమే కావాలి" అంటూ సాగే సంభాషణతో ఆలోచింపజేసింది. నోట్లరద్దు, పెట్రోల్ ధరలు లాంటి అంశాల్ని స్పృశిస్తూ సెటైరికల్ కామెడీగా ఆకట్టుకుంది. నారా రోహిత్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం 2014 ఎన్నికల సమయంలో విడుదలైంది.
సర్కార్..
విదేశాల్లో స్థిరపడిన ఓ ప్రవాసుడు ఓటేయడానికి దేశానికి వస్తాడు. కానీ అప్పటికే అతడి ఓటు ఇంకెవరో వేసినట్టు రికార్డులో ఉంటుంది. ఈ ఓట్ల స్కాంను ఎలా ఎదుర్కొన్నాడో చూపిస్తూ ఓటుకున్న విలువను తెలియజేస్తారు సినిమాలో. అన్యాయం జరిగినపుడు చట్టప్రకారం ఎలా వెళ్లాలో తెలుపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు హీరో. విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది. విజయ్ కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది.
ఎవడైతే నాకేంటి..
నాయకులు చేస్తున్న అన్యాయాన్ని చూడలేక రాజకీయల్లోకి వస్తాడు ఓ సైనికుడు. మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడుతున్న తండ్రిపై గెలిచి హోంమంత్రి అవుతాడు హీరో. పోలీసు వ్యవస్థకు స్వతంత్రాధికారాలిస్తూ సమాజంలో మార్పు తీసుకురావచ్చు అనే కథాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. రాజశేఖర్ హీరోగా 2007లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్నందుకుంది.
అధినేత..
హంగ్ ఏర్పడినపుడు స్వతంత్ర అభ్యర్థులు ఎంత కీలకంగా మారతారో అధినేత చిత్రంలో చూపించారు. 25 మంది స్వతంత్ర అభ్యర్థుల గ్రూపునకు లీడర్‌గా హంగ్ సమయంలో ముఖ్యమంత్రి అవుతాడు హీరో. సమాజంలో అక్రమాలను రూపుమాపుతూ మార్పుకోసం పాటు పడతాడు. జగపతిబాబు హీరోగా 2009లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
ఈ విషయాలన్నీ రీల్ లైఫ్‌లో ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రతి రాజకీయనాయకుడు ఇలాగే ఉంటే బాగుండు అని సగటు మనిషి అనుకునేలా ఉంటాయి. కానీ రియల్‌లైఫ్‌లో మార్పు సాధ్యమైనా? మారడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారా? అసలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? అంటే మౌనమే సమాధానం.