'రాజకీయం'.. ప్రజలను చాలా ప్రభావితం చేసే అంశం. పేపర్, టీవీ.. ఎందులో వచ్చినా సరే దానిని చాలా ఆసక్తిగా చూస్తారు, చదువుతారు. మరి పొలిటికల్ డ్రామాతో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తీస్తే ఊరుకుంటారా? అంతే ఇష్టంగా వీక్షిస్తారు. ఇలాంటి కొన్ని కథలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు కొత్త రంగులద్దుతున్నాయి. డిజిటల్లో ఈ తరహా కంటెంట్ పెరిగేకొద్ది ఇలాంటి సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
అభిరుచి ఎక్కువ..
మన ప్రజలు పొలిటికల్ అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఇంత ఎక్కువ జనాభా కలిగిన దేశంలో ప్రతి అంశం జనజీవనంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే దర్శకులు ఈ రకమైన సినిమాలు తీస్తున్నారు. అద్భుతమైన సక్సెస్‌ను అందుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన 'తాండవ్', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్', 'మేడమ్ చీఫ్ మినిస్టర్' ఈ కోవలోకే వస్తాయి.
వివాదాస్పదమైనా..
ఈ పొలిటికల్ కంటెంట్ సమాజంలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. తమ అభిమాన రాజకీయ నాయకుల నిజజీవితాలు, నమ్మే సిద్ధాంతాలపై వస్తున్న చిత్రాలతో ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని చిత్రాలు/సిరీస్‌లు వివాదాస్పదం కూడా అయ్యాయి. అందులో తాండవ్ ఒకటి. హిందూ సిద్ధాంతాలను కించపరుస్తూ ఈ వెబ్ సిరీస్ ఉందని పలు రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి.
మేడమ్ ఆఫ్ మినిస్టర్ సినిమాపై కూడా పలు ఊహాగానాలు వచ్చాయి. అది బీఎస్పీ నాయకురాలు మాయావతి నిజజీవిత ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ అని అన్నారు. కానీ మాయావతిపై తీసిన కంటెంట్ కాదని స్వయాన హీరోయిన్ రిచా చద్దా చెప్పినప్పటికీ.. దీనిపై వచ్చిన ఊహాగానాలు మరింత ఆదరణను తీసుకొచ్చాయి. ఒకానొక సందర్భంలో ప్రజలు రాజకీయాల వల్ల ప్రభావితమవుతున్నారు కాబట్టి తను ఆ స్టైల్ కంటెంట్‌పై నటించడానికి ఒప్పుకున్నానని రిచానే చెప్పింది. దీన్నిబట్టి ఈ జానర్‌కు ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
"న్యూస్ ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇది కేవలం మర్డర్, సెలబ్రిటీ గాసిప్‌లు మాత్రమే కాదు. అందులో నేషనల్ న్యూస్ అందరినీ ప్రభావితం చేస్తోంది. అందుకే పొలిటికల్ డ్రామాలు పాపులర్ అవుతున్నాయి."