'పెంగ్విన్' చిత్రంలోని మాస్క్ మెన్ గురించి టీమ్‌లో ఎవరికీ తెలియదని దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ అన్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కీలకపాత్రను పోషించారు. అయితే మరికొన్నిరోజుల్లో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా గురించి దర్శకుడు ఈశ్వర్ ఆసక్తికర విశేషాలను తెలియజేశారు. షూటింగ్ సమయంలో కొన్ని మర్చిపోలేని ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
"పెంగ్విన్' కథను 18 రోజుల్లోనే రాశాం. 36 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం. చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొడైకెనల్‌లో షూట్ చేస్తున్న సమయంలో ఓరోజు సెట్‌లో ఏర్పాటు చేసిన భారీ లైట్స్ ప్రమాదవశాత్తు తేనేపట్టు మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా తేనేటీగలు చిత్రబృందంపై దాడి చేశాయి. ఆ సమయంలో కీర్తి అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో ఆమె భయాందోళనలకు గురయ్యారు. తేనేటీగల దాడిలో కొంతమంది సభ్యులు గాయపడిన కారణంగా కొంతసమయం షూటింగ్ నిలిపివేశాం. చికిత్స అనంతరం తిరిగి ప్రారంభించాం. ఈ సినిమాలోని మాస్క్ మెన్ గురించి టీంలో ఎవరికీ తెలీదు. కీర్తికి కూడా షూటింగ్ తర్వాతే ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారో చెప్పాం."