నేడు (మంగళవారం) భారత్ 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. దీంతో ఈ రోజు దేశభక్తిని పెంపొందించే సినిమాలు టీవీల్లో సందడి చేస్తాయి. కొందరు తమ మొబైల్స్‌లోనూ అలాంటి చిత్రాలను వీక్షించడానికి ఆసక్తి చూపిస్తారు. దేశభక్తిని పెంపొందించే ఎన్నో చిత్రాలు ఈ 72 ఏళ్లలో చాలానే వచ్చాయి. టాలీవుడ్‌లోనూ పలు సినిమాలు వచ్చి అలరించాయి. స్టార్ హీరోలూ తమ సినిమాల్లో దేశభక్తి నేపథ్యంలోని కథలను ఎంచుకుని హిట్టు కొట్టారు. అలా దేశభక్తి ప్రధానంగా టాలీవుడ్లో రూపొందిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
బొబ్బిలి పులి
1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం 'బొబ్బలి పులి'. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేశభక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం అందుకుంది.
అల్లూరి సీతారామరాజు
1974లో కృష్ణ హీరోగా వచ్చిన చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు, రివార్డులను సాధించింది. ఇది కృష్ణ నటించిన 100వ చిత్రం కావడం విశేషం.
సుభాష్ చంద్రబోస్
వెంకటేశ్, శ్రియ, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సుభాష్ చంద్రబోస్'. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో వెంకీ నటన ఆకట్టుకుంటుంది. మణిశర్మ సంగీతం అలరిస్తుంది. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకీ పాత్ర దేశభక్తిని పెంపొందించేలా ఉంటుంది.
మేజర్ చంద్రకాంత్
ఎన్టీఆర్, మోహన్‌బాబు ప్రధానపాత్రల్లో కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ తెలుగు ఇళ్లలో మారుమోగుతూనే ఉన్నాయి. 'పుణ్యభూమి నా దేశం' అనే పాటలో ఎన్టీఆర్.. శివాజీ, వీరపాండ్య కట్ట బ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రల్లో కనిపించి అలరించారు.
భారతీయుడు
1996లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 'భారతీయుడు'. లంచగొండితనాన్ని అరికట్టేందుకు నడుం బిగించిన ఓ భారతీయుడి పాత్రలో కమల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో కమల్‌తో పాటు కాజల్, సిద్దార్థ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఖడ్గం
విభిన్న చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన దేశభక్తి చిత్రం 'ఖడ్గం'. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండియాలో హిందూ, ముస్లింల మధ్య స్నేహ బంధం.. తమ దేశం జోలికొస్తే అందరం ఒక్కటవుతామనే సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటేనే ఉన్నాయి.
మహాత్మ
శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'మహాత్మ'. ఒక వీధి రౌడీ గాంధీ మార్గంలో ప్రయాణించి ఎలా మంచివాడిగా మారాడనేది కథాంశం. ఇందులోని పాటలు, సన్నివేశాలు దేశభక్తిని ఎంతగానో పెంపొదిస్తాయి.
ఇవే కాకుండా సైరా నరసింహా రెడ్డి, పరమవీర చక్ర, ఆజాద్, ఘాజీ, కొమురం పులి, జై, నేటి భారతం వంటి చిత్రాలు దేశభక్తిని పెంపొదిస్తాయి.