భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. దీనికి ఒక రకంగా తెలుగు చిత్రసీమే చిరునామాగా నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగులోనే అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు ముస్తాబవుతున్నాయంటే.. ఇక్కడ ఆ ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దక్షిణాది భాషలన్నింటిలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాలు కలుపుకొంటే.. ఈ సంఖ్య డజనుకు పైగానే ఉంటుంది. అయితే ఇప్పుడీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు కొవిడ్ పరిస్థితుల వల్ల కొత్త సవాళ్లెదురవుతున్నాయి. వీటి విడుదల అన్నది అన్ని రాష్ట్రాలతో ముడిపడి ఉన్న వ్యవహారం. అన్ని చోట్లా థియేటర్లు తెరవడానికి అనుకూలమైన వాతావరణమున్నప్పుడే.. ఆ సినిమాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతమైతే ఆ వాతావరణం ఏ చిత్రసీమలోనూ కనిపించడం లేదు.
"తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న వాతావరణం చిన్న సినిమాలకే కలిసొస్తుంది. తెలంగాణలో పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో 50శాతం ఆక్యుపెన్సీనే ఉండటం వల్ల పెద్ద సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాల విడుదలంటే మరింత కష్టసాధ్యమైన విషయం. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా చిత్రసీమలు తెరచుకున్నప్పుడే వాటి విడుదలకు మార్గం సుగమం అవుతుంది. అయితే దీనికి ఎన్నాళ్ల సమయం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం."
- ఓ ప్రముఖ నిర్మాత
ప్రస్తుతం దేశంలో మిగతా చిత్ర పరిశ్రమల్లో కనిపిస్తున్న వాతావరణం చూస్తుంటే.. రానున్న పాన్ ఇండియా సినిమాలు కొత్త కష్టాలు ఎదుర్కోక తప్పదనే అర్థమవుతోంది.
రానున్న ఆర్‌ఆర్‌ఆర్..
ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నది 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాను అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఓవైపు మూడో దశ కరోనా ముప్పు భయపెడుతున్న వేళ.. అప్పటికి మిగతా చిత్రసీమలు పూర్తి స్థాయిలో తెరచుకుంటాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దిల్లీ, ముంబయిలలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులిచ్చినా.. ఇప్పటి వరకు కొత్త సినిమాల సందడి మొదలు కాలేదు. ఈనెల 19న అక్షయ్ కుమార్ 'బెల్‌బాటమ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడీ దీనికి దక్కే ప్రేక్షకాదరణను బట్టే.. బాలీవుడ్ వెంటనే ఊపందుకుంటుందా? లేదా? అన్నది ఓ స్పష్టత రానుంది.