"చిత్ర పరిశ్రమలో నలభై ఏళ్లుగా కొనసాగుతున్నానంటే అది సినిమాలపై ఉన్న తపన వల్లే. ఇన్నేళ్ల కెరీర్‌లో మరే చిత్రమూ ఇవ్వలేనంత సంతృప్తి 'పలాస 1978'తో దక్కింది" అన్నాడు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. అతడి సమర్పణలో వస్తోన్న ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించాడు. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించారు. ధ్యాన్ అట్లూరి నిర్మించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడాడు.
"దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. 'మాభూమి' తరహా చిత్రంలా అనిపించింది. అందుకే ఈ కథతో సినిమా చేయాలని ప్రసాద్‌కు సూచించా. నిజానికి ఈ చిత్రం ఇంత చక్కగా పూర్తి చేసుకుందంటే అది అతడి వల్లే. ఏదో స్నేహం కొద్దీ నా పేరు వేస్తానంటే సరే అన్నాను."
"గాంధీ, అంబేడ్కర్ వంటి గొప్ప వ్యక్తుల ఆశయాల్ని పక్కకు తోసేసి వాళ్ల విగ్రహాలను వీధుల్లో పెట్టుకుంటున్నాం. అందుకే ఈ రోజుకీ ఊళ్లలో హరిజన వాడలుంటున్నాయి. కులమతాల మధ్య అంతరాలు అలాగే ఉంటున్నాయి. పట్టణాల్లో పెద్దగా కనపడట్లేదు కానీ, ఊళ్లలో నేటికీ జనం వాళ్లలో వాళ్లు కొట్టుకునే పరిస్థితులుంటున్నాయి. ఇప్పుడిలాంటి అంశాలనే 'పలాస'లో ఎంతో వాస్తవికంగా సహజత్వం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. 'శంకరాభరణం', 'మాభూమి' వంటి వాస్తవికతకు దగ్గరగా ఉన్న కల్ట్ చిత్రాలు చూసినప్పుడు నాకు ఆ తరహా ప్రయత్నాలు చెయ్యాలనిపించేది. కానీ, కుదర్లేదు. అందుకే ఇప్పుడింత గొప్ప చిత్రం నా పేరు మీదుగా వస్తున్నందుకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. కరుణకు సినిమా పట్ల ఉన్న తపన, పట్టుదల, నిష్ఠను దాన్ని తెరపైకి తీసుకురావడంలో ఎంతో చక్కగా చూపించాడు. ఈ చిత్రం కోసం నటుడిగా, నిర్మాతగా రక్షిత్ పెద్ద సాహసమే చేశాడు. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాత్మక కథల విషయంలో ఫలితం కాస్త అటు ఇటైనా ఆర్థికంగా, కెరీర్ పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది" అని అన్నాడు తమ్మారెడ్డి భరధ్వాజ.
ఇదీ చూడండి..'క్రష్'లో కరోనా.. వైరలవుతోన్న ఫొటోలు