చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం 'ఆస్కార్'. ప్రతి ఏటా పలు విభాగాల్లోఈ అవార్డులను అందజేస్తుందిఅకాడమీ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్).లాస్ ఏంజిలెస్‌లోని డాల్బీ థియేటర్లో ఫిబ్రవరి 9న పురస్కార ప్రదానోత్సవం అట్టహాసంగా జరగనుంది.ఇందులో ప్రముఖంగా భావించే 'ఉత్తమ చిత్ర' విభాగంలో 9 సినిమాలు తుది రేసులో నిలిచాయి. అవేంటే తెలుసుకుందామా..
జోకర్
ఓ సూపర్‌హీరో చిత్రంలో విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన విలన్ పాత్రే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం 'జోకర్'. ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు జోక్విన్ ఫోనిక్స్. సినిమాలో విభిన్న భావోద్వేగాలను పండించి మెప్పించాడీ స్టార్ నటుడు. అయితే హీరో హింసాయుతంగా ఎందుకు మారాడు? తన మనసులో అంత విద్వేషానికి దారితీసిన పరిస్థితులేంటి అనే విషయాలను చర్చిస్తూ ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది విమర్శించినా... ఫోనిక్స్ అద్భుత నటన, సాంకేతిక విలువలకు అందరూ ఫిదా అయిపోయారు. అందుకే వంద కోట్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయం సాధించింది. వెనిస్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇప్పడు ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతోంది.
పారాసైట్
పేద కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కడుపు నింపుకోవడానికే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వారంతా ఉద్యోగాల కోసం ఓ ధనిక కుటుంబం దగ్గరకు వెళ్తారు. తామంతా ఒకే కుటుంబం అన్న విషయాన్ని యజమానులకు చెప్పరు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాలు చేస్తున్న వారిని మోసపూరితంగా ఆ ఇంటి నుంచి పంపేస్తారు. యజమాని కుటుంబం విహార యాత్రకు వెళ్లినప్పుడు ఆ ఇంటిలోని సౌకర్యాలను అనుభవిస్తూ దర్జాగా గడుపుతారు. అయితే ఉద్యోగాలు కోల్పోయినవారికి వీరంతా ఒకే కుటుంబం అన్న విషయం తెలిసిపోతుంది. అంతలోనే యజమాని కుటుంబం తిరిగి వస్తోందని వారికి సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తమ బండారం బయటపడితే ఉద్యోగాలు పోతాయన్న భయంతో వాళ్లేం చేశారు? అనే విషయాలతో తెరకెక్కిన దక్షిణ కొరియా చిత్రం 'పారాసైట్'.
పేద, ధనిక వర్గాల అంతరాల వల్ల సమాజంలో నెలకొన్న కఠోర పరిస్థితులకు... వినోదాన్ని జోడించి దర్శకుడు 'బాంగ్ జూన్ హొ' ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ కొరియా సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న తొలి కొరియన్ చిత్రంగానూ పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఆస్కార్ కోసం రేసులో ఉంది.
1917
మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ దర్శకుడు శామ్ మెండిస్ తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో ప్రధానపాత్రల్లో నటించారు జార్జ్ మెక్‌కే, డీన్ చార్లెస్ చాంప్‌మ్యాన్. ఈ ఏడాది ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకుడు సహా పది విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు సాధించింది '1917' చిత్రం. ఏడు బాఫ్టా అవార్డులు అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు గెలుచుకుంది. ఆస్కార్‌లోనూ సత్తా చాటడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శత్రు దేశ సైనిక దళంపై దాడికి సిద్ధమవుతుంటుంది బ్రిటీష్ సైన్యం. అయితే ఆ దాడిని వెంటనే ఆపేయాలని, లేకపోతే శత్రుదేశం పన్నిన పన్నాగంలో 1600 సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అధికారులకు తెలుస్తుంది. ఆ విషయాన్ని సైనికులకు చేరవేసే బాధ్యతను ఇద్దరికి అప్పగిస్తారు. వారు సకాలంలో ఆ సమాచారాన్ని చేరవేశారా? ఆ దాడి ఆగిందా లేదా అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
మ్యారేజ్ స్టోరీ
తొలుత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'మ్యారేజ్ స్టోరీ'.. ఆ తర్వాత తక్కువ థియేటర్లలోనే ప్రదర్శితమైంది. కానీ 2019లో వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఓ సినిమా అని టైమ్ మ్యాగజైన్, అమెరికన్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ లాంటి సంస్థలు కొనియాడాయి. గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా పోటీల్లో అత్యధిక నామినేషన్లు అందుకుని ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ బరిలోనూ ఉత్తమ చిత్రం సహా ఆరు నామినేషన్లు అందుకుంది. విడాకుల కోసం ఎదురుచూస్తున్న భార్యభర్తల కథతో 'నోహ్ బవుమ్‌బచ్' ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆడమ్ డ్రైవర్, స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
వైవాహిక జీవితంలో సమస్య వస్తే బయటి వ్యక్తుల మీద ఆధారపడితే ఆ బంధానికి మరింత నష్టమే జరుగుతుందని తెలుసుకుంటారు. వారి మధ్య ఉండే అనుబంధాన్ని వారి కన్నా ఎక్కువగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరని చెప్పడమే ఈ చిత్ర కథాంశం.
ది ఐరిష్‌మ్యాన్
ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సెసె తెరకెక్కించిన క్రైమ్ నేపథ్య చిత్రం 'ది ఐరిష్‌మ్యాన్'. 'ఐ హార్డ్ యు పెయింట్ హౌసెస్' అనే పుస్తకం ఆధారంగా ఇది రూపొందింది. ప్రముఖ నటులు రాబర్ట్ డి నీరో, అల్ పసినో, జో పెస్సి ప్రధాన పాత్రధారులు. ఫ్రాంక్ షీరన్ అనే ట్రక్ డ్రైవర్ అనుకోకుండా చీకటి సామ్రాజ్యంలోకి ప్రవేశించి గ్యాంగ్‌స్టర్‌గా మారిన వైనాన్ని ఈ చిత్రం చూపించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం సహా 10 ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకుంది.
జోజో రాబిట్
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పేరు చెబితే ప్రపంచమంతా వణుకుతుంది. హిట్లర్‌తో ఓ పిల్లాడికి స్నేహం కుదిరితే.. ఆ పిల్లాడు కోరుకున్నప్పుడల్లా ఆయన ప్రత్యక్షమై కబుర్లు చెబితే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన కామెడీ చిత్రం 'జోజో రాబిట్'.
నాజీ జాతికి చెందిన ఓ పిల్లాడు హిట్లర్ ప్రారంభించిన యూత్ ఆర్మీలో సభ్యుడిగా ఉంటాడు. హిట్లర్ తన స్నేహితుడని ఊహించుకుంటూ మాట్లాడుతుంటాడు. ఓ రోజు అతడి తల్లి ఓ యూదు బాలికను నాజీల బారి నుంచి కాపాడటానికి తన ఇంట్లో దాచిందని తెలుస్తుంది. అప్పుడు ఏం చేశాడన్నది ఈ చిత్ర కథాంశం. ఓ సందేశాన్ని చెప్పడానికి వినోదాన్ని మించిన మార్గం లేదని ఈ చిత్రం తెలిపింది. టైకా వైటిటి తెరకెక్కించిన ఈ చిత్రంలో రోమన్ గ్రిఫిన్ డేవిస్, థామసిన్ మెక్‌కెంజీ ప్రధాన పాత్రల్లో నటించారు.
లిటిల్ ఉమెన్
నలుగురు అక్కచెల్లెళ్ల జీవితంలో ఎదురైన అనుభవాలే 'లిటిల్ ఉమెన్'. అదే పేరుతో 1868లో ప్రచురితమైన ఓ నవలకు ఇది తెర రూపం. సవొఇర్సె రోనన్, ఎమ్మా వాట్సన్, ఫ్లోరెన్స్ పుఘ్, ఎలిజా స్కాన్‌లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. వారి మధ్య అనుబంధం, ప్రేమకథలతో జీవితంలోని అన్ని అనుభూతులను ఆవిష్కరించేలా ఈ చిత్రం రూపొందింది.
ఫోర్డ్ వెర్సస్ ఫెరారి
ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఫోర్డ్, ఫెరారి మధ్య రేసింగ్ కార్ విషయంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ఫోర్డ్ వెర్సస్ ఫెరారి'. 1963లో ఫోర్డ్ యజమాని హెన్రీ ఫోర్డ్.. ఫెరారి కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎంజో ఫెరారి ముందు ప్రతిపాదన పెడతాడు. కానీ ఫెరారి అవమానకర రీతిలో దాన్ని తిరస్కరిస్తాడు. అప్పుడు ఫెరారి కారును తలదన్నేలా ఓ అత్యాధునిక రేసింగ్ కారును తయారు చేయాలని హెన్నీఫోర్డ్ సంకల్పిస్తాడు. హెన్రీ ఫోర్డ్ కల నెరవేరిందా లేదా అన్నది ఈ సినిమా కథ. మాట్ డామన్, క్రిస్టియన్ బాలె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జేమ్స్ మ్యాన్‌గోల్డ్ తెరకెక్కించాడు.
ఒన్స్ ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
హాలీవుడ్‌లో 1920 - 1970 మధ్య కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఆ కాలంలోని హాలీవుడ్ చిత్రసీమకు నివాళిగా ప్రముఖ దర్శకుడు క్వెంటిన్ టరంటినో తెరకెక్కించిన చిత్రం 'ఒన్స్ ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్'. ప్రముఖ నటులు లియోనార్డో డికాప్రియో, బ్రాడ్‌పిట్, మార్గట్ రోబీ ప్రధాన పాత్రధారులు.
1969లో రిక్ డాల్టన్ అనే టీవీ నటుడు తన కెరీర్ ముగిసిపోతోందని భయపడుతుంటాడు. ప్రత్యామ్నాయంగా హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తాడు. డూప్‌గా నటించే క్లిఫ్ బూత్ కూడా అతనికి తోడుగా ఉంటాడు. అక్కడ వారిద్దరికీ ఎదురైన అనుభవాలేంటన్నది ఈ చిత్ర కథ.
ఒన్స్ ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ ఇదీ చూడండి..'సీటీమార్'తో ఆ దర్శకుడి కొడుకు తెరంగేట్రం