తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బైకుల్లా జైలుకు రియా.. రెండు వారాలు అక్కడే!

సుశాంత్​ కేసులో మాదకద్రవ్యాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను.. బుధవారం జైలుకు తరలించారు. 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీలో భాగంగా.. సెప్టెంబర్​ 22 వరకు ఆమెను బైకుల్లా మహిళా జైలులో ఉంచనున్నారు.

NCB moves Rhea Chakraborty to Byculla Jail
14 రోజుల బైకుల్లా జైలులోనే రియా చక్రవర్తి..?

By

Published : Sep 9, 2020, 5:17 PM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తిని.. పోలీసులు జైలుకు మార్చారు. ఈ కేసులో డ్రగ్స్‌ కోణంపై ఆమెను మూడు రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన తర్వాత మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ (సెప్టెంబర్​ 22 వరకు)కి అనుమతించింది.

ప్రముఖులతో పాటే..!

బుధవారం రాత్రంతా ఎన్‌సీబీ కార్యాలయంలోనే ఉన్న రియాను.. ఇవాళ బైకుల్లా మహిళా జైలుకు తరలించారు అధికారులు. షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా, భీమా కోరెగాన్‌ కేసులో అరెస్టయిన ఉద్యమకారిణి సుధా భరద్వాజ్‌ వంటి వారు ఈ జైలులోనే ఉన్నారు.

బెయిల్​పై రేపు విచారణ...

తన స్నేహితుడు సుశాంత్‌ కోసం ఆమె మాదకద్రవ్యాలను తీసుకొచ్చేదని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న అధికారులు.. రియా డ్రగ్స్‌ వాడకంపై ఎటువంటి ప్రస్తావనా చేయలేదు. శామ్యూల్‌ మిరండా, దీపేశ్‌ సావంత్‌ మాత్రం సుశాంత్‌ కోసం తాము డ్రగ్స్‌ తీసుకొచ్చేవాళ్లమని, రియా డబ్బులిచ్చేదని పేర్కొన్నట్టు సమాచారం. తాజాగా ముంబయి కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై.. ముంబయి సెషన్స్‌ కోర్టు సెప్టెంబర్​ 10న విచారణ చేయనుంది.

జూన్‌ 14న సుశాంత్‌ ఆకస్మిక మరణం నేపథ్యంలో రియా కుటుంబం అనేక అభియోగాలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో రియా.. సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటోంది. నటి అరెస్టు తర్వాత ఆమె లాయర్‌ స్పందిస్తూ "మాదక ద్రవ్యాలకు బానిసై, మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ప్రేమించడం వల్లే ఇప్పుడు రియాను ఎన్‌సీబీ, సీబీఐ, ఈడీ వేటాడుతున్నాయి. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే" అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌ సహా 9 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది.

ABOUT THE AUTHOR

...view details