'బాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. 'సోలో' సినిమాతో యువ అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్. కథల విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిరుచి కలిగిన నటుడు. కుటుంబానికి సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ.. ఆ ప్రభావం, ప్రమేయం లేకుండా తనకి నచ్చిన కథల్ని ఎంచుకుంటూ, పరిమిత వ్యయంతో కూడిన చిత్రాల్ని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 'సోలో', 'ప్రతిధ్వని', 'రౌడీ ఫెలో', 'అసుర', 'జ్యో అచ్యుతానంద' తదితర విజయాలు అందుకున్నాడు రోహిత్. ఈ రోజు నారా రోహిత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం రండి.
'బాణం'తో దూసుకొచ్చి.. 'సోలో'గా మెప్పించి!
విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోన్న హీరో నారా రోహిత్. ఈ రోజు రోహిత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడైన నారా రోహిత్ హైదరాబాద్‌లో పాఠశాల విద్యని అభ్యసించాడు. వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్మీడియట్, చెన్నై అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా అందుకొన్నాడు. ఆ తర్వాత న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనకు సంబంధించిన కోర్సు చేశాడు.
2009లో విడుదలైన 'బాణం' విమర్శకుల మెప్పు పొందింది. నటుడిగా రోహిత్ ప్రతిభేంటో ఆ చిత్రంతో తెలిసింది. దాంతో ఆయనకు వరుసగా అవకాశాలొచ్చాయి. వేగంగా సినిమాలు చేయడంలో రోహిత్ దిట్ట. 2016, 2017లో 'తుంటరి', 'సావిత్రి', 'రాజా చెయ్యి వేస్తే', 'జ్యో అచ్యుతానంద', 'శంకర', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'శమంతకమణి', 'కథలో రాజకుమారి', 'బాలకృష్ణుడు' చిత్రాల్లో నటించాడు రోహిత్. 'వీరభోగ వసంతరాయలు', 'ఆటగాళ్లు'’ చిత్రాల్లోనూ నటించి సందడి చేశాడు. 'బాణం' లో సన్నగా కనిపించిన రోహిత్, ఆ తర్వాత కాస్త బొద్దుగా మారాడు. 'బాలకృష్ణుడు' చిత్రంలో మళ్లీ నాజూగ్గా కనిపించాడు. ఆరన్ మీడియా వర్క్స్ సంస్థని స్థాపించిన నారా రోహిత్.. నిర్మాణంలోనూ అడుగుపెట్టాడు.