తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమా బాగుందని ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు!' - nani

రాహుల్​ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్​ సింగరాయ్'​ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. సినిమా... కావ్యంలా ఉందంటూ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్​ మీట్​ పెట్టిన చిత్రబృందం సినిమా గురించిన ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

shyam singha roy
nani

By

Published : Dec 28, 2021, 6:57 AM IST

Updated : Dec 28, 2021, 7:15 AM IST

"సినిమా బాగుందని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్‌ అనిపిస్తోంది" అన్నారు కథానాయకుడు నాని. ఆయన నటించిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. సోమవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకని నిర్వహించింది చిత్రబృందం.

సక్సెస్​ మీట్

"ఎలాంటి పరిస్థితులు ఉన్నా మంచి చిత్రాలను ఆదరిస్తామని ప్రేక్షకులు ప్రతిసారీ నిరూపిస్తూనే ఉన్నారు. వరుస విజయాలతో ఈనెల అంతా బాగుంది. అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఇలాగే మరో పదేళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 'సఖి'లాంటి ఎప్పటికీ నిలిచిపోయే లవ్‌స్టోరీ చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడీ చిత్రంతో ఆ కోరిక తీరింది. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌. ఈ న్యూ ఇయర్‌ కూడా మనదే"

- నాని, నటుడు

హిట్టును నడిపించుకొని తీసుకొచ్చారు..

"రాహుల్‌ రెండో చిత్ర దర్శకుడైనా ఓ సున్నితమైన అంశాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రం చేసేటప్పుడు నిర్మాత వెంకట్‌ బోయనపల్లి.. 'ఓ హిట్టు సినిమా ఎలా తీయాల'ని నన్నడిగారు. ఈరోజు ఆయన దగ్గరకి నాని ఓ హిట్టును నడిపించుకుని తీసుకొచ్చారు. నాని, సాయిపల్లవిల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకు ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారారా అనుకుంటున్న తరుణంలో.. 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్‌ సింగరాయ్‌'తో వరుస హిట్లు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర విడుదల సమయంలో నాని మాట్లాడిన ఓ విషయాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజానికి తను చెప్పిన ఫీలింగ్‌ వేరు. ఆయన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు" అని అన్నారు నిర్మాత దిల్‌రాజు.

సక్సెస్ మీట్

చిత్రాన్ని గుడిలా..

దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ మాట్లాడుతూ "అందరం కలిసి రాయి రాయి పేర్చి ఈ చిత్రాన్ని ఓ గుడిలా కట్టాం. ఈరోజు మాకు దక్కిన విజయం మాది కాదు. ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి చిత్రాలు ఆడుతున్నాయి. వాళ్లకి కథ.. కథనం.. కవిత్వం.. సంగీతం.. ప్రతిదానిపైనా మంచి అభిరుచి ఉంది. అందుకే థియేటర్‌కు వచ్చి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. నా జీవితంలో ముగ్గురు శ్యామ్‌ సింగరాయ్‌లు ఉన్నారు. అందులో ఒకరు మా నాన్న. పుస్తకాల్ని.. కమ్యునిజాన్ని పరిచయం చేసింది ఆయనే. సినిమాలో శ్యామ్‌ బావి దగ్గర మాట్లాడే సీన్‌ ఒకటుంటుంది. అది నాన్న అనుభవాల నుంచి రాసుకున్నదే. నాకు రెండో శ్యామ్‌ సింగరాయ్‌ సిరివెన్నెల గారు. మీరు నాకెంతో స్పెషల్‌ సర్‌. ఇక నా మూడో శ్యామ్‌ సింగరాయ్‌.. రియల్‌ సింగరాయ్‌ నాని గారు. ఆయన వల్లే ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది. మీరు లేకపోతే ఈ చిత్రం లేదు" అన్నారు.

సాయి పల్లవి

దానికి కారణం దర్శకుడే..

సాయిపల్లవి మాట్లాడుతూ "ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం దర్శకుడు రాహుల్‌. చిత్రాన్ని ఎంతో కవితాత్మకంగా చూపించారు. సాను మంచి విజువల్స్‌ ఇచ్చారు. నీరజ అద్భుతమైన కాస్ట్యూమ్స్‌ ఇచ్చింది. కీర్తి పాత్రలో కృతి ఎంతో చక్కగా ఒదిగిపోయింది. నటన పట్ల నానికి ఉన్న నిబద్ధత నాకు చాలా నచ్చింది. ఇప్పటికీ ప్రతి సినిమాకీ తొలి చిత్రమన్నట్లుగానే కష్టపడుతుంటారు" అంది.

"సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చినంత ప్రేమ ఇంకెవరూ ఇవ్వలేరు. ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాని నటన చూశాక.. నటిగా మరింత స్ఫూర్తి పొందా. సాయిపల్లవి అద్భుతంగా నటించారు. ఇంత మంచి కథ అందించిన సత్యదేవ్‌ జంగాకు, నాకీ అవకాశమిచ్చినందుకు దర్శకుడు రాహుల్‌కు కృతజ్ఞతలు" అంది కృతి శెట్టి.

'శ్యామ్​ సింగరాయ్'

థ్యాంక్యూ నాని..

నిర్మాత వెంకట్‌ బోయనపల్లి మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు తలవంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా విషయంలో నాకెంతో సహాయం చేసిన దిల్‌రాజు, శిరీష్‌కు థ్యాంక్స్‌. కొవిడ్‌ సమయంలో చిత్ర బృందం ఎంతో కష్టపడి పని చేసి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమా కోసం సాయిపల్లవిని చాలా శ్రమ పెట్టాం. కృతి బాగా చేసింది. రాహుల్‌ సంకృత్యాన్‌ వల్లే ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది. ఆఖరిగా నానికి నేను చెప్పగలిగింది ఒకటే.. థ్యాంక్స్‌ సర్‌" అన్నారు. కార్యక్రమంలో ఆర్‌.నారాయణమూర్తి, అభినవ్‌ గోమటం, కె.అవినాష్‌, సత్యదేవ్‌ జంగా, నీరజ కోన తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

ఏపీలో థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది: ఆర్.నారాయణమూర్తి

నానితో బోల్డ్​సీన్ అందుకే చేశా: కృతిశెట్టి

Shyam Singha Roy Review: 'శ్యామ్​ సింగరాయ్​' అదరగొట్టాడా?

Last Updated : Dec 28, 2021, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details