'ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' ఫేం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం చెంది నేటిని నెలరోజులైంది. యువ నటుడి మరణంతో యావత్ భారత్ దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికీ పలువురు నటులు తమతో అనుబంధాన్ని పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా దర్శకుడు ముఖేశ్ ఛబ్రా ఓ సందేశాన్ని ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశాడు. సోదరుడా నిన్ను మిస్ అవుతున్నానని పేర్కొంటూ.. "నేటికి నెల రోజులైంది. అప్పట్నుంచి నీ నుంచి ఫోన్ రాలేదు" అంటూ భావోద్వేగంతో సందేశం పెట్టారు ఛబ్రా. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ నెల 24న..
ముఖేశ్ ఛబ్రా, సుశాంత్ కాంబినేషన్లో తెరకెక్కి చిత్రం 'దిల్ బెచారా'. ఇదే యువహీరో ఆఖరిగా నటించిన చిత్రం. సంజనా సంఘీ కథానాయిక. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. జులై 24న డిస్నీ+హాట్ స్టార్‌లో దీన్ని విడుదల చేయనున్నారు.
తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం గతేడాది నవంబరులోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు ఆలస్యం కావడం వల్ల వేసవి కానుకగా మే 8వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఈలోగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుండటం, లాక్‌డౌన్, థియేటర్లు మూతపడటం వల్ల సినిమా విడుదల కూడా వాయిదా పడింది. సరిగ్గా ఈ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సుశాంత్.. జూన్ 14న తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సైఫ్ అలీఖాన్, మిలింద్ గుణాజీ, జావేది జాఫ్రీ కీలక పాత్రలు పోషించారు. 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.