రచన:సుద్దాల అశోక్ తేజ
సంగీతం: యశో కృష్ణ
గానం:సాయిచరణ్
పల్లవి:
ఎవ్వతిరా - ఇది ఎవ్వతిరా
ఈ కరోన రక్కసి ఎవ్వతిరా
ఎంతదిరా ఇది ఎంతదిరా
మన సంకల్పం ముందెంతదిరా
కేంద్ర - రాష్ట్ర సర్కార్ల అండతో
ఢీ అంటూ జేగంటలు కొడతాం
తమసోమా జ్యోతిర్గమయంటూ
దీపమెట్టి వైరస్ తరిమేస్తాం
చరణం 1:
అవ్వతోడు - తెగ కొవ్వు బలిసి - ఇది
తొవ్వ తప్పి మువ్వన్నెల జెండా
యవ్వన భూజన ప్రాణదివ్వెలతొ
గవ్వలాడుటకు కాలు దువ్వినది
చెయ్యి కలిపితే దయ్యమవుతది
నోటి తుంపరతొ అంటుకుంటది
భయ్యా దీన్ని మసి చెయ్యాలంటే
చెయ్యి కలపకనె ఒక్క తాటిపై
నమస్కారమనె కత్తితో - కరోనా
గొంతు కొయ్యవలె - కోరలు తియ్యవలె
చరణం 2:
గడప దాటక ఉండి - కరోనా
గండానికి ఇక పిండం పెడతాం
గజం గజం దూరం పాటిస్తూ
కరోనాతో వంతెన తెగ్గొడతాం
మనలొ మనకు జబ్బుందనిపిస్తే
నూటానాలుగుకు ఫోను కొట్టుతాం
క్వారంటైన్‌కు వెళ్లి భారత
జాతి ఆయుశుకు గ్యారెంటిస్తాం
ప్లేగు పేగు తెంపేసిన ఘనులం
గత్తరను తొడగొట్టి తరిమినం
మతభేదాలు విడిచి కరోనాను
ఖతం చేసి దుర్గతిని బాపుతం ।।ఎంత।।
చరణం 3:
తమ ప్రాణాలను గడ్డిపోచవలె
భావించే వైద్యులకు - నర్సులకు
ఆలుబిడ్డలను మరచి సేవలో
అలుపెరుగని పోలీసు బిడ్డలకు
మురికిలోన - మురికయ్యె బతుకులను
పణం పెట్టె మున్సిపాలిటోళ్లకు
నిరంతరం చైతన్యపరిచె
ప్రెస్సు - మీడియా మార్గదర్శులకు
ప్రణామంగ - పాదాలు తాకుతాం
సరిహద్దులొ మన సైనికులోలె
కరోన శత్రుతొ యుద్ధం చేసే
మన అత్యవసర సేవకులందరి
అండదండతో - క్రమశిక్షణతో
కరోనాను దునుమాడి తీరుతాం ।।ఎంత।।
"తెలుగునాట సాంస్కృతిక కళా రూపాల్లో యక్షగానం ఒక అద్భుత ప్రక్రియ. 'కరోనా', 'భయంకరోనా' అంటూ జాగ్రత్తలు చెబుతూ జనాన్ని జాగృతపరచే కవితలు, పాటలు పత్రికల్లో చదువుతున్నాను. టీవీల్లో వింటున్నాను. ముఖ్యంగా ఈనాడు పత్రికలో మా సినీ కవులు రాస్తున్నవి చదువుతున్నాను. ఈటీవీలో చూస్తున్నాను. కరోనాపై నా పాట యక్షగాన రీతిలో రాయాలనిపించింది. గతంలో 'ఒసేయ్ రాములమ్మా' చిత్రంలో రాస్తే అద్భుత స్పందన వచ్చింది. తెలుగునాట ప్రజలకు, చదువరులకే కాకుండా వినువరులకూ ఉత్తేజం కలిగిస్తూ భయం తొలిగి నిశ్చయ జయంపై విశ్వాసం కలిగించాలనే ప్రయత్నంలో యక్షగానంలో రాశాను.
కూచిపూడి యక్షగానంలో శాస్త్రీయత, గ్రాంథికత ఉంటుంది. తెలంగాణ యక్ష గానంలో వాడుక పదాల జానపదాల - జనం బాణీల త్రివిక్రమత్వంతో సామాన్య జనం గుండెల్లోకి దూసుకుపోతుంది. పల్లవిలోనే పాఠకులకు, శ్రోతలకు చెప్పదలచిన ఆత్మను పలికించాలని ప్రగాఢంగా నమ్మాను గనుక మన 'సంకల్పం ముందు కరోనా ఎంత' అనే ధైర్యం రంగరించాను. చప్పట్లు - జేగంటలు - దీప ప్రకాశనలు సంఘీభావ సంకేతాలుగా ప్రస్ఫుటించిన - ప్రకటించిన కోట్ల ప్రజల సమైక్యతా స్పందనను అనుపల్లవిగా చెబుతూ 'నమ్మకం' కలిగించేలా చూశాను.
అచ్చమైన ప్రజల ఇంటి భాషలో కరోనా కొవ్వెక్కి మన మువ్వన్నెల జెండా యవ్వన భూజన (మన దేశంలో యువత ఎక్కువ కదా) మనతో గవ్వలాడటానికి వచ్చిందని కరోనా తెగింపును ఎండగట్టి - చెయ్యి కలపొద్దని - నోటి తుంపరలకు దూరముండాలని - మన సనాతన నమస్కారాన్ని కత్తిలా చేసి కరోనా కోరలు తియ్యాలని ఘోషించాను.
రెండో చరణంలో గడప దాటకుండానే కరోనాకు పిండం పెట్టాలని - గజం దూరంలో కరోనాకు మనకు మధ్యన గల వంతెన కూలగొట్టాలని - కరోనా జబ్బు అనుమానం వస్తే నూటనాలుగుకు ఫోన్ చేసి చికిత్స పొందాలని - క్వారంటైన్ అంటే భారత జాతి ఆయుష్షుకు గ్యారెంటీ అని చెప్పా. మనం గతంలో ఎన్నో వ్యాధుల్ని జయించామని, ఆ జైత్రయాత్రలో మతభేదం విడిచి దేశానికి పట్టిన కరోనా దుర్గతిని ఖతం చేస్తామనే నమ్మకం మరింత బలోపేతం చేశాను.
చివరి చరణంలో ప్రజల కోసం ప్రాణాలు పణం పెట్టి సేవ చేస్తున్న అందరికి పాదాభివందనం చేసి క్రమశిక్షణతో కరోనాను దునుమాడతామని తెలిపాను."
- సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత
మరిన్ని పాటలు రావాలి...
"మారుమూల పల్లెల్లో నివసించే సామాన్య ప్రజలకీ సులభంగా అర్థమయ్యే పాట ఇది. కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరగాలి. అందుకే దీన్ని యక్షగానం తరహాలో చేశాం. పల్లె వాసన ఉంటుంది ఈ పాటలో. సుద్దాల అశోక్‌తేజ సర్, నేను కలిసి 600 పాటలు చేశాం. వాటన్నిటికంటే ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కరోనాపైనే ఈమధ్యే 'బలాదూర్ జులాయోడ' అంటూ ఓ పాట చేశాం. అది మంచి ఆదరణ పొందింది. ఈ కొత్త పాట తెలంగాణ యాసలోనే సాగుతుంది. సుద్దాల అశోక్‌తేజ సర్ చాలా మంచి సాహిత్యం అందించారు. మహమ్మారి కరోనాపై మరిన్ని పాటలు రావాల్సిన అవసరం ఉంది. ఎంత అవగాహన పెరిగితే, అంతగా ఈ వైరస్‌ని అరికట్టగలుగుతాం".
- యశోకృష్ణ, సంగీత దర్శకుడు
ఇదీ చూడండి..'గంగోత్రి' టు 'అల వైకుంఠపురంలో'.. బన్నీ స్టైల్