అమ్మ-నాన్న, అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నో బంధాలతో మనల్ని కలిపిన దేవుడు స్నేహితుడిని ఎందుకు దూరం పెట్టాడో అర్థం కాదు. ఆలోచిస్తే అది బంధం కాదు భావోద్వేగమని అర్థమౌతుంది. పరీక్షల్లో ఫెయిలైతే 'లైట్ రా' అంటూ ధైర్యం చెబుతాడు.. క్లాస్ బంక్‌లు కొట్టిస్తాడు.. భవిష్యత్తుపై భరోసానూ కలిగిస్తాడు.. అవసరమైతే కాస్త కఠినంగానూ ఉంటాడు! ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం!
హ్యాపీడేస్
'పాదమెటుపోతున్నా.. పయనమెందాకైనా' అంటూ సాగే ఈ పాట వింటే చాలు స్నేహం విలువేంటో తెలుస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ చిత్రం వాస్తవికానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో ప్రేమ, ఆప్యాయతలను చక్కగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమా చూసే.. ఇంజినీరింగ్ కోర్సు చదివిన వారున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా యువతపై ప్రభావం చూపిందీ చిత్రం.
ఉన్నది ఒకటే జిందగీ..
"ట్రెండు మారినా ఫ్రెండు మారడే" అంటూ స్నేహానికి సరికొత్త నిర్వచనం తెలిపిన చిత్రం ఉన్నది 'ఒకటే జిందగీ'. స్నేహితుడు ఎందుకు ముఖ్యమో ఈ సినిమా చాటిచెప్పింది. ఆమోదయోగ్యమైన సంభాషణలతో, ఆకట్టుకునే పాటలతో స్నేహాన్ని, ప్రేమను బ్యాలెన్స్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. "మన కథలు చెబితే వినేవాడు ఫ్రెండ్.. కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్" లాంటి డైలాగ్‌లతో సినీ ప్రియుల్ని అలరించిందీ చిత్రం.
స్నేహంకోసం
పది మందిలో వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెబితే.. అతడి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇదే కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం.. 'స్నేహం కోసం'. మిత్రుడి కుటుంబం బాగుండాలని తన జీవితాన్నే త్యాగం చేస్తాడు హీరో. ఈ సినిమాలో చిరు నటనకు ప్రేక్షకులు దాసోహం అయిపోతారు. పతాక సన్నివేశంలో వచ్చే పాట చూసి కంటతడి పెట్టని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! అంతగా ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసేలా ఉంటుందీ సినిమా.